గ్రూప్ 2 ఉద్యోగాల అప్లికేషన్లకు నేడు తుది గడువు. తెలంగాణలో 783 గ్రూప్-2 ఉద్యోగాలకు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (https://www.tspsc.gov.in/) నోటిఫికేషన్ విడుదల చేసింది. జనవరి 18 నుంచి అప్లికేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. నేటితో ఈ దరఖాస్తుల గడువు ముగియనుంది. అభ్యర్థులు ఫిబ్రవరి 16 సాయంత్రం 5 గంటలలోపు తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. గడువును పొడిగించే అవకాశం లేదని టీఎస్పీఎస్సీ వర్గాలు చెబుతున్నాయి. అందుకే అభ్యర్థులు ఆఖరి నిమిషంలో ఇబ్బందులు పడకుండా వెంటనే అప్లై చేసుకోవడం బెటర్. బుధవారం సాయంత్రానికి గ్రూప్ 2 అప్లికేషన్ల సంఖ్య 4.83 లక్షలు దాటినట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించింది. చివరి రోజున మరో 50 వేల అప్లికేషన్లు నమోదయ్యే అవకాశాలున్నాయి. అయిదు లక్షలకు పైగా అభ్యర్థులు పోటీ పడనుండటంతో గ్రూప్ 2 పోస్టులకు ఈ సారి భారీ పోటీ ఉందని అర్థమవుతోంది.
READ THIS: తెలంగాణ, ఏపీలో 3,746 పోస్టాఫీస్ ఉద్యోగాలు.. టెన్త్ పాసైతే చాలు.. అప్లికేషన్ లింక్ ఇదే..

గ్రూప్-2 కింద మొత్తం 783 ఖాళీలు ఉండగా.. ఇందులో అత్యధికంగా జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలు 165, మండల పంచాయతీ అధికారి 126, నాయిబ్ తహసీల్దార్ 98, ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ 97 తదితర పోస్టులు ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం https://www.tspsc.gov.in/ వెబ్ సైట్ ద్వారా మీ దరఖాస్తులను సబ్మిట్ చేయండి.