గ్రూప్ 4 దరఖాస్తుల గడువును టీఎస్పీఎస్సీ పొడిగించింది. ముందుగా ప్రకటించిన మేరకు ఈ రోజుతో (జనవరి 30) గడువు ముగియనుంది. దరఖాస్తుల రద్దీ.. పలుమార్లు సర్వర్ మొరాయించటంతో అప్లికేషన్ల గడువును పొడిగించాలని అభ్యర్థుల నుంచి విజ్ఞప్తులు వెల్లువెత్తాయి. దీంతో సోమవారం మధ్యాహ్నం అత్యవసరంగా భేటీ అయిన టీఎస్పీఎస్సీ బోర్డు అప్లికేషన్ల గడువు పొడిగించటంపై చర్చించింది. ఇటీవల అదనపు పోస్టులు కూడా జోడించిన కారణంగా అప్లికేషన్ల గడువు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఫిబ్రవరి 3వ తేదీ వరకు గ్రూప్ 4 అప్లికేషన్లకు తుది గడువు ఇచ్చినట్లు టీఎస్పీఎస్సీ ప్రకటన విడుదల చేసింది.


ఇప్పటి వరకు 8,47,277 మంది అభ్యర్థులు గ్రూప్ 4 కు దరఖాస్తులు సమర్పించినట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో దరఖాస్తు గడువును నాలుగు రోజులు పొడిగించాలని బోర్డు నిర్ణయం తీసుకుంది.
తెలంగాణలో లక్షలాది మంది నిరుద్యోగులు ఆసక్తిగా ఎదురు చూసిన నోటిఫికేషన్లలో గ్రూప్-4 ఒకటి. మొదట 9168 ఖాళీలను భర్తీ చేస్తున్నట్లు వెబ్ నోట్లో ప్రకటించగా.. డిటైల్డ్ నోటిఫికేషన్లో పోస్టుల సంఖ్య 8039గా మాత్రమే ఉంది. దీంతో మొత్తం 1129 ఖాళీలు తగ్గడంతో నిరుద్యోగులు తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే.. పంచాయితీ రాజ్ విభాగంలో ఈ 1129 పోస్టులు తగ్గాయి. ఆ శాఖ నుంచి కేవలం కొన్ని పోస్టులకు మాత్రమే ప్రతిపాదనలు అందడం.. మిగతా వాటి విషయంలో ఆ శాఖ నుంచి స్పష్టత రాకపోవడమే ఇందుకు కారణం. తాజాగా మరో 141 ఖాళీలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో మొత్తం ఖాళీల సంఖ్య 8,180కు చేరింది. అయితే.. ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఈ రోజు.. అంటే జనవరి 30తో ముగియనుంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ రోజు సాయంత్రం 5 గంటలలోగా తమ దరఖాస్తులను https://www.tspsc.gov.in/ వెబ్ సైట్లో సమర్పించాల్సి ఉంటుంది.