తెలంగాణలో ఈ రోజు నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. అయితే.. ఎగ్జామ్ స్టార్ట్ అయిన కొద్ది సేపటికే వాట్సాప్ లో క్వశ్చన్ పేపర్ చక్కర్లు కొట్టడం కలకలం రేపుతోంది. వికారాబాద్ జిల్లా తాండూరులో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ వార్త వైరల్ గా మారడంతో పేరెంట్స్, స్టూడెంట్స్ లో ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ విషయమై పలువురు ఉన్నతాధికారులు స్పందిస్తూ.. ఈ వార్తల్లో నిజం లేదని కొట్టపారేస్తున్నారు. ఈ విషయమై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని విద్యార్థులు, తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఉదయం 9:37కే ప్రశ్నాపత్రం వాట్సాప్ గ్రూప్ లలో వచ్చింది. ఈ విషయంపై కొందరు ఉన్నతాధికారులకు అధికారులకు సమాచారం ఇచ్చారు.

అయినా.. పేపర్ మనది కాదని వారు బుకాయించినట్లు తెలుస్తోంది. పరీక్ష ముగిసిన తర్వాత బయటకు వచ్చిన విద్యార్థుల వద్ద ఉన్న పేపర్లను పరీశీలిస్తే.. వాట్సాప్ లో ఉన్న పేపర్, అది ఒకటే కావడంతో అంతా షాక్ కు గురయ్యారు. విషయంపై కలెక్టరేట్ నుంచి పిలుపురావడంతో హుటాహుటిన డీఈవో కలెక్టరేట్ కు వెళ్లినట్లు సమాచారం. ఇంటెలిజెన్స్ అధికారులు సైతం రంగంలోకి దిగి వివరాలను సేకరిస్తున్నట్లు సమాచారం. ఈ అంశంపై తాండూరు గవర్నమెంట్ టీచర్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది.
నలుగురు సస్పెండ్, ఒకరిపై విచారణ ప్రారంభం : కలెక్టర్
జిల్లా పరిధిలోని తాండూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చోటుచేసుకున్న ప్రశ్నపత్రం లీకేజీపై జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి మీడియాతో మాట్లాడారు. పరీక్ష ప్రారంభానికి ముందు పేపర్ లీక్ కాలేదని, పరీక్ష ప్రారంభించాక పార్టు ఏ కశ్చన్ పేపర్ ఇచ్చాక గైర్హజరైన విద్యార్థులవి మిగిలిన ప్రతాలను ఇంచార్జీ అధికారికి ఇచ్చేందుకు అదనపు ఇన్విజిలేటర్ బందెప్ప తీసుకుని ఆపీసుకు వెళ్లారు. ఆ సమయంలో సెల్ ఫోన్ ద్వారా ఫోటోలు తీసి వాట్సాప్, ఫేస్ బుక్ ద్వారా బయటి వ్యక్తులకు పంపారు. అక్కడే విధులు నిర్వహిస్తున్న సమ్మప్ప సహకరించడంతో ఈ ప్రశ్నపత్రం బయటికి వెల్లిందని జిల్లా కలెక్టర్ వివరించారు. పరీక్ష కేంద్రంలోకి సెల్ పోన్లు, ఇతర ఎలక్ర్టానిక్స్ వాచ్లు, కెమెరాలు తీసుకువెల్లకుండ నిబంధనలున్నాయి. నిబంధనలను పాటించని ఎగ్జామినేషన్ ఇంచార్జీ గోపాల్, ఎగ్జామినేషన్ డిపార్టుమెంటల్ అధికారి శివకుమార్ లు నిర్లక్ష్యంగా విధులు నిర్వహించినందుకు గాను నలుగురు అధికారులు బందెప్ప, సమ్మప్ప, గోపాల్, శివకుమార్ లను విధుల నుండి తొలగించడం జరిగిందని క్లర్క్ శ్రీనివాస్ పాత్ర ఈ సంఘటనలో ఎంత మేర ఉందనే విషయంపై విచారణ ప్రారంభించామని సదరు అధికారిని విధులకు హాజరు కాకుండా నిలిపి వేసినట్లు జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. పూర్తి విచారణ చేపట్టామని నివేధికలు వచ్చాక కఠిన చర్యలుంటామని కలెక్టర్ తెలిపారు.