తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఈనెల 24 లేదా 25 తేదీల్లో విడుదల చేసేందుకు ఇంటర్ బోర్డ్ ఏర్పాట్లు చేసుకుంటోంది. ఇంటర్మీడియట్ అన్ని సబ్జెక్టుల మూల్యాంకనం ఈనెల 10వ తేదీతో ముగియనుంది. మార్కుల ఎంట్రీ, మెమోల తయారీ ప్రక్రియ పది పన్నెండు రోజుల్లో పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు. దీంతో 25వ తేదీన ఫలితాలు వెల్లడించే అవకాశముంది.
మార్చి 5వ తేదీ నుంచి ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు మార్చి 20వ తేదీన ముగిశాయి. ఈసారి దాదాపు 9.80 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఇప్పటికే జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభమైంది. ఈసారి రాష్ట్రంలో స్పాట్ ఎవాల్యుయేషన్ కేంద్రాల సంఖ్యను కూడా పెంచారు. గతేడాది 17 మాత్రమే ఉండగా.. ఈసారి 19కి పెంచారు. ఒక్కో లెక్చరర్ ఒక్కో రోజు 40 జవాబు పత్రాల చొప్పున వాల్యుయేషన్ చేశారు. ఈనెల 10వ తేదీ నాటికి మూల్యాంకన ప్రక్రియ పూర్తవుతుంది. ఏప్రిల్ 29వ తేదీ నుంచి ఎప్‌సెట్ పరీక్షల షెడ్యూలు ప్రారంభమవుతుంది. ఈ పరీక్షలకు నాలుగు రోజుల ముందుగా… 24 లేదా 25వ తేదీన ఫలితాలు విడుదల చేయాలని ఇంటర్ బోర్డు భావిస్తోంది.
ఇంటర్మీడియట్ జవాబు పత్రాల మూల్యాంకనంలో ఈసారి ఇంటర్ బోర్డు మరిన్ని ముందు జాగ్రత్తలు తీసుకుంటోంది. ఫలితాలు వచ్చిన తర్వాత మార్కులు రాలేదని, అధ్యాపకులు చేసిన తప్పిదం వల్లే తాము ఫెయిల్ అయ్యామనే ఆరోపణలు రాకుండా.. రీ చెక్ విధానం అమలు చేస్తోంది. 35 మార్కుల కంటే తక్కువ వచ్చిన విద్యార్థుల జవాబు పత్రాలను చీఫ్ ఎగ్జామినర్, సబ్జెక్టు నిపుణులతో ర్యాండమ్‌గా పునః పరిశీలిస్తున్నట్లు బోర్డు వర్గాలు తెలిపాయి.