ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) 2025-–2026 సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ బ్యాంకుల్లో కామన్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్(సీఆర్‌పీ) పీఓ/ ఎంటీ-XIV, సీఆర్‌పీ ఎస్‌పీఎల్-XIV నోటిఫికేషన్ విడుదల చేసేందుకు రెడీ అవుతోంది. ఈ మేరకు త్వరలో ప్రకటన వెలువడనుంది. దీని ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ బ్యాంకుల్లో ప్రొబేషనరీఆఫీసర్, స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టనుంది. మొత్తం పోస్టుల్లో తెలంగాణ రాష్ట్రంలో కూడా ఖాళీలుంటాయి.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ, బీఈ, బీటెక్, పీజీ, ఎంబీఏ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు. పీఓ, ఎస్‌ఓలకు 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఆన్‌లైన్ టెస్ట్(ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్), ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. గతేడాది 3,049 ప్రొబేషనరీ ఆఫీసర్/ మేనేజ్‌మెంట్ ట్రెయినీలు, 1,402 స్పెషలిస్ట్ ఆఫీసర్ ఖాళీలు భర్తీ అయిన విషయం తెలిసిందే.
ఖాళీలు భర్తీ కానున్న బ్యాంకులు: బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, యూకో బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.
పరీక్ష తేదీలు: పీఓ పోస్టులకు- ప్రిలిమినరీ పరీక్షలు అక్టోబర్ 19, 20వ తేదీల్లో, ఎస్‌ఓ పోస్టులకు నవంబర్ 9న పరీక్ష నిర్వహించనున్నారు. మెయిన్స్ పీఓ పోస్టులకు- నవంబర్ 30న, ఎస్‌ఓ పోస్టులకు డిసెంబర్ 14న పరీక్ష నిర్వహించనున్నారు.