తెలంగాణ కాలేజీల్లో ఈ ఏడాది డిగ్రీ, ఇంజనీరింగ్‌లో చేరిన 10 వేల మంది విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం బంపర్ ఆఫర్ అందించింది. ఏకంగా బ్యాంకింగ్ ఫైనాన్సియల్, ఇన్సురెన్స్ కంపెనీల్లో జాబ్ గ్యారంటీ పాటు క్యాంపస్ సెలెక్షన్ ఉండేలా వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రెగ్యులర్ డిగ్రీతో పాటు విద్యార్థులకు ఉచితంగా బీఎఫ్ఎస్ఐ మినీ డిగ్రీని అందిస్తుంది. రాష్ట్రంలో ఎంపిక చేసిన 20 ఇంజనీరింగ్, 18 డిగ్రీ కాలేజీల్లో చేరిన విద్యార్థులకు ఈ ఏడాది శిక్షణను అందిస్తుంది. ఈ నెల 25వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.
ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం యువత నైపుణ్యాల అభివృద్ధికి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసింది. అదే వరుసలో డిగ్రీ, ఇంజనీరింగ్ విద్యార్థులకు ఖరీదైన బీఎఫ్ఎస్ఐ (బ్యాంకింగ్ ఫైనాన్సియల్ సర్వీసెస్, ఇన్సురెన్స్) కోర్సును ఉచితంగా అందించిన రాష్ట్రంగా దేశంలోనే అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
తెలంగాణ ప్రభుత్వం యువతకు నైపుణ్యాల శిక్షణ అందించేందుకు మరో ముందడుగు వేసింది. ఇంజనీరింగ్, డిగ్రీ కోర్సులు చదువుతున్న విద్యార్థులకు బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ (BFSI) రంగంలో ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు ప్రత్యేక శిక్షణను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభిస్తోంది.
BFSI రంగంలో ప్రపంచ వ్యాప్తంగా ఐటీ & ఐటీఈఎస్ నిపుణులకు భారీగా డిమాండ్ ఉంది. హెచ్ఎస్బీసీ, జేపీ మోర్గాన్, స్టేట్ స్ట్రీట్, మాస్ మ్యూచువల్, లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ వంటి BFSI గ్లోబల్ కెపాసిటీ సెంటర్లు దేశంలో దాదాపు 5 లక్షల ఉద్యోగాలను సృష్టించాయి. ఇప్పటికే హైదరాబాద్‌ను ఈ రంగంలో కీలక వ్యాపార కేంద్రంగా గుర్తించారు.
ప్రత్యేక శిక్షణ ప్రోగ్రామ్:
ఈ కోర్సు ప్రపంచంలో అత్యంత ఖరీదైన శిక్షణలలో ఒకటిగా ఉన్న BFSI రంగానికి సంబంధించింది. ప్రతి విద్యార్థిపై శిక్షణ ఖర్చు రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు ఉంటుంది. అయితే, విద్యార్థులు శిక్షణ పూర్తయ్యాక తమ సంస్థల్లోనే పని చేస్తారా లేక వేరే సంస్థలకు వెళుతారా అనేది గ్లోబల్ కెపాబులిటీ సెంటర్లకు ప్రధాన సవాలుగా మారింది.
ముఖ్యమంత్రి చొరవతో:
ఈ రంగంలో ఉన్న డిమాండ్‌ను గుర్తించిన ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి, యువతకు డిగ్రీతో పాటు నైపుణ్య శిక్షణ అందించేందుకు జనవరిలోనే BFSI ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ ప్రోగ్రామ్ ప్రారంభించేందుకు తెలంగాణ ఉన్నత విద్యామండలి (TGCHE), BFSI కన్సార్టియంతో ఒప్పందం కుదుర్చుకుంది.
కోర్సు వివరాలు:
ఈ అకడమిక్ ఇయర్ నుంచే (2024-25) తెలంగాణ ఉన్నత విద్యామండలి ఎంపిక చేసిన 20 డిగ్రీ కాలేజీలు, 18 ఇంజనీరింగ్ కాలేజీల్లో పైలెట్ ప్రాజెక్టుగా ఈ కోర్సును అమలు చేస్తారు.
కోర్సు ప్రకారం, ఇంజనీరింగ్ విద్యార్థులకు ఇది మైనర్ డిగ్రీ ప్రోగ్రామ్, యాక్సిలరేటెడ్ కోర్సుగా ఉంటుంది. డిగ్రీ కాలేజీల్లో స్కిల్ ఎన్‌హాన్స్మెంట్ కోర్స్ (SEC), జనరిక్ ఎలెక్టివ్స్ (GE) పాఠ్యాంశాలు నేర్పిస్తారు.
ఉచిత శిక్షణ:
అత్యంత ఖరీదైన ఈ కోర్సు రివాల్వింగ్ ఫండ్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) నిధులతో ప్రభుత్వం నిర్వహిస్తుంది. దీంతో ప్రభుత్వానికి ఆర్థిక భారం లేకుండా, విద్యార్థులకు కూడా ఖరీదైన ఫీజుల భారముండదు. BFSI సంస్థలతో సంప్రదింపులు జరిపిన ప్రభుత్వం EQUIPPP సంస్థను ఈ ప్రోగ్రామ్ నిర్వహణకు ఎంపిక చేసింది. ఈ సంస్థ రూ.2.50 కోట్లను అందించేందుకు ముందుకు వచ్చింది. ప్రతి సంవత్సరం పది వేల మంది విద్యార్థులకు మూడు సంవత్సరాలకు అవసరమయ్యే రివాల్వింగ్ ఫండ్ సమీకరిస్తుంది.
జాబ్ గ్యారంటీ.. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్:
డిగ్రీతో పాటు ఈ శిక్షణను అందుచుంటున్న పది వేల మంది విద్యార్థుల వివరాలను తెలంగాణ ఉన్నత విద్యామండలి ప్రత్యేక పోర్టల్‌లో అందుబాటులో ఉంచుతుంది. కోచింగ్ సమయంలోనే విద్యార్థులను నేరుగా బీఎఫ్ఎస్ఐ కంపెనీలు వీడియో కాల్ ద్వారా ఇంటర్వ్యూ చేసి.. క్యాంపస్ ప్లేస్మెంట్ ఇచ్చేందుకు వీలుగా కోర్సు డిజైన్ చేశారు. కోచింగ్ పూర్తి చేసిన పది వేల మంది విద్యార్థులకు సర్టిఫికెట్తో పాటు అర్హులైన వారికి ఇంటర్‌షిప్, జాబ్ గ్యారంటీ ఉంటుంది.