పుదుచ్చేరిలోని జవహర్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (JIPMER) 2024–25 విద్యా సంవత్సరానికి బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ కోర్సుల్లో అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 24వ తేదీలోగా ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి. బీఎస్సీ నర్సింగ్‌లో 94 సీట్లు, బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్సెస్ కోర్సుల 87 సీట్లు ఉన్నాయి. నీట్-యూజీ 2024 స్కోరు, రూల్ ఆఫ్ రిజర్వేషన్, కౌన్సెలింగ్ తదితరాల ఆధారంగా సీటు కేటాయిస్తారు.
కోర్సులు: మెడికల్ ల్యాబొరేటరీ సైన్సెస్, అనస్థీషియా టెక్నాలజీ, ఆప్టోమెట్రీ, కార్డియాక్ ల్యాబొరేటరీ టెక్నాలజీ, డయాలసిస్ థెరపీ టెక్నాలజీ, మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ(బ్లడ్ బ్యాంకింగ్), మెడికల్ రేడియాలజీ, ఇమేజింగ్ టెక్నాలజీ, న్యూరోటెక్నాలజీ, న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజీ, పెర్ఫ్యూజన్ టెక్నాలజీ, రేడియోథెరపీ టెక్నాలజీ కోర్సులు ఉన్నాయి. కోర్సు వ్యవధి నాలుగేళ్లు.
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో 10+2 హయ్యర్/ సీనియర్ సెకండరీ పరీక్ష(ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ/ బోటనీ & జువాలజీ) ఉత్తీర్ణతతో పాటు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్-యూజీ 2024)లో అర్హత సాధించి ఉండాలి. వయసు 31 డిసెంబర్ 2024 నాటికి 17 ఏళ్ల వయస్సు పూర్తి చేసి ఉండాలి. గరిష్ట వయోపరిమితి లేదు.
అప్లికేషన్స్: అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో అక్టోబర్ 3 నుంచి అక్టోబర్ 24 వరకు దరఖాస్తు చేసుకోవాలి. నవంబర్ 25 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. పూర్తి వివరాలకు www.jipmer.edu.in వెబ్సైట్లో సంప్రదించాలి.