తెలంగాణలోని నిరుద్యోగులకు శుభవార్త. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి లైన్ క్లియర్ అయింది. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని 12 యూనివర్సిటీలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల డైరెక్ట్ రిక్రూట్మెంట్కు కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ఈ మేరకు ఏప్రిల్ 4వ తేదీన జీవో నెం. 21 జారీ చేసింది. దీని ప్రకారం గతంలో ఉన్న నియామక నిబంధనలను రద్దు చేసింది. కొత్తగా మూడు దశల్లో నియామక ప్రక్రియ చేపట్టే విధానం అమల్లోకి తెచ్చింది.
తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి (TGCHE) చైర్మన్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన హై లెవెల్ కమిటీ సూచనల ఆధారంగా ప్రభుత్వం ఈ మార్గదర్శకాలను రూపొందించింది. రాష్ట్రంలోని 12 యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లు మరియు రిజిస్ట్రార్లు ఈ మార్గదర్శకాలను తమ ఎక్స్క్యూటివ్ కౌన్సిల్ లో ఆమోదించాల్సి ఉంటుంది.
ఈ కొత్త మార్గదర్శకాలు అన్ని సాంప్రదాయ విభాగాలకు, ఇంజినీరింగ్, టెక్నాలజీ, లైబ్రరీ సైన్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగాలకు వర్తిస్తాయి. నియామకాల సమయంలో తెలంగాణ రాష్ట్ర రిజర్వేషన్ విధానం, రోస్టర్ విధానాన్ని ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది.
మూడు దశల్లో నియామక ప్రక్రియ
1. అకడమిక్ రికార్డ్ & పరిశోధన ప్రదర్శన (50 మార్కులు)
కంపోజిషన్: వైస్ ఛాన్సలర్, ఉన్నత విద్యామండలి సబ్జెక్ట్ నిపుణుడు, బోర్డు ఆఫ్ స్టడీస్ చైర్‌పర్సన్, మరియు హెడ్ ఆఫ్ ది డిపార్టుమెంట్ కన్వీనర్‌గా ఉండే స్క్రూటినీ కమిటీ అంచనా వేస్తుంది.
UG మార్కులు:
- 70% పైగా – 8 మార్కులు
- 60–70% – 6 మార్కులు
- 50–60% – 4 మార్కులు
- 50% కంటే తక్కువ – 2 మార్కులు
PG మార్కులు:
- 70% పైగా – 12 మార్కులు
- 60–70% – 10 మార్కులు
- 50–60% – 8 మార్కులు
అర్హత పరీక్షల మార్కులు:
- JRF – 10 మార్కులు
- NET/SET/SLET – 5 మార్కులు
- Ph.D. – 10 మార్కులు
- M.Phil. – 5 మార్కులు
రీసెర్చ్ పబ్లికేషన్లు, కాన్ఫరెన్సులు: గరిష్ఠంగా 5 మార్కులు
టెక్నికల్ విభాగాలు (AICTE గైడ్‌లైన్స్): లేకపోతే GATE తరహా పరీక్ష – 20కి స్కేల్, Ph.D. వారికి నార్మలైజ్ చేస్తారు.
2. విషయ పరిజ్ఞానం & బోధనా నైపుణ్యం (30 మార్కులు)
స్క్రీనింగ్ కమిటీ: డీన్, ఉన్నత విద్యామండలి నిపుణుడు, వీసీ నామినేట్ చేసిన నిపుణుడు
బోధనా అనుభవం: సంవత్సరానికి 1 మార్కు (గరిష్టంగా 10)
పుస్తక రచన:
- స్వీయ రచన – 5 మార్కులు
- సంయుక్త రచన – 3 మార్కులు
- ఎడిటర్‌గా – 2 మార్కులు
ఫెలోషిప్స్: పోస్ట్-డాక్టరల్ ఫెలోషిప్/రిసెర్చ్ అసోసియేట్ – 2 మార్కులు/సంవత్సరం (గరిష్టం 5)
డెమో లెక్చర్: గరిష్టంగా 10 మార్కులు
3. ఇంటర్వ్యూ (20 మార్కులు)
వైస్ ఛాన్సలర్ అధ్యక్షతన సెలక్షన్ కమిటీ ఇంటర్వ్యూ నిర్వహిస్తుంది. అభ్యర్థి డొమైన్ నాలెడ్జ్, సబ్జెక్ట్ ప్రెజెంటేషన్, రీసెర్చ్ ఆప్టిట్యూడ్, వ్యక్తిత్వం అంచనా ఆధారంగా మార్కులుంటాయి.
షార్ట్‌లిస్టింగ్ & పారదర్శకత
ప్రతి దశ తర్వాత అభ్యర్థుల జాబితా, మార్కులు అధికారిక వెబ్‌సైట్లలో ప్రచురిస్తారు. 1:10 నిష్పత్తిలో టాప్ 10 మంది రెండవ దశకు, 1:5 నిష్పత్తిలో టాప్ 5 మంది చివరి ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. రెండు సందర్భాల్లోనూ రిజర్వేషన్లు పరిగణనలోకి తీసుకుంటారు.