గ్రూప్ 1 (TSPSC GROUP 1) పరీక్షను రద్దు చేస్తూ టీఎస్పీఎస్సీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్ 1 తో పాటు ఇప్పటికే నిర్వహించిన డీఏవో (DAO) Divisional Accounts Officer, ఏఈఈ (AEE) (Assistant Executive Engineer) పరీక్షలను రద్దు చేసింది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను (TSPSC) రిలీజ్ చేసింది.
పేపర్ లీకేజీ వ్యవహారంతో ఇప్పటికే ఏఈ (AE) పరీక్షను టీఎస్పీఎస్సీ రద్దు చేసింది. తాజాగా తీసుకున్న నిర్ణయంతో ఇప్పటివరకు జరిగిన నాలుగు పరీక్షలు రద్దయ్యాయి. రద్దయిన గ్రూప్ 1 పరీక్షను జూన్ 11న నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించింది. మిగతా రద్దయిన పరీక్షల తేదీలను త్వరలోనే ప్రకటించనుంది. ఈ మేరకు టీఎస్పీఎస్సీ అధికారికంగా విడుదల చేసిన ప్రకటన ఇక్కడ అందిస్తున్నాం.
Group 1 పరీక్ష గత ఏడాది అక్టోబర్ 16న జరిగింది. DAO పరీక్ష ఫిబ్రవరి 26న, ఏఈఈ పరీక్ష జనవరి 22న జరిగింది. మార్చి 5న ఏఈ పరీక్ష జరిగింది. లీకేజీ వ్యవహారం బయటపడటంతో ఈ పరీక్షలన్నీ రద్దయ్యాయి.

ఇదిలా ఉంటే.. తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలి గ్రూప్-1 నోటిఫికేషన్ ను మొత్తం 503 ఖాళీలతో విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన ప్రిలిమినరీ ఎగ్జామ్ ను అక్టోబర్ 16న నిర్వహించింది. మొత్తం 503 పోస్టులకు గాను.. 3,80,081 మంది దరఖాస్తు చేసుకోగా.. వీరిలో 2,85,916 మంది ప్రిలిమ్స్ పరీక్షకు హాజరయ్యారు. ఒక్కో పోస్టుకు 50 మందిని చొప్పున మొత్తం 25,050 మందిని మెయిన్స్ కు ఎంపిక చేసింది పబ్లిక్ సర్వీస్ కమిషన్. దీంతో మెయిన్స్ కు ఎంపికైన అభ్యర్థులంతా సీరియస్ గా ప్రిపరేషన్లో ఉన్నారు. ఇప్పుడు పరీక్షను రద్దు చేస్తూ టీఎస్పీఎస్సీ నిర్ణయం తీసుకోవడంతో వీరంతా ఆందోళనలో ఉన్నారు.