తెలంగాణలో గత నెల 18వ తేదీన ప్రారంభమైన గ్రూప్-2 దరఖాస్తు ప్రక్రియ ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ముగిసింది. గడువు ముగిసే సమయం వరకు మొత్తం 5,51,943 దరఖాస్తులు వచ్చినట్లు పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) తెలిపింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. మొత్తం 783 గ్రూప్-2 ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుంది పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఇందుకు సంబంధించిన పరీక్షల తేదీలను త్వరలో ప్రకటిస్తామని టీఎస్పీఎస్సీ ప్రకటనలో పేర్కొంది. అయితే.. గ్రూప్-2 దరఖాస్తు గడువును సైతం పొడిగిస్తారన్న ప్రచారం జరిగింది.

కానీ.. టీఎస్పీఎస్సీ మాత్రం ముందు ప్రకటించిన గడువు వరకు మాత్రమే దరఖాస్తులను స్వీకరించింది. ఎలాంటి టెక్నికల్ సమస్యలు తలెత్తకుండా దరఖాస్తు ప్రక్రియ సాగడంతో గడువును పొడిగించలేదని సమాచారం. గ్రూప్-2 కింద మొత్తం 783 ఖాళీలు ఉండగా.. ఇందులో అత్యధికంగా జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలు 165, మండల పంచాయతీ అధికారి 126, నాయిబ్ తహసీల్దార్ 98, ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ 97 తదితర పోస్టులు ఉన్నాయి.