తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్. రాష్ట్రంలోని 12 యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి లైన్ క్లియరయింది. ఖాళీగా ఉన్న 402 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇటీవలే యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. అందుకు సంబంధించి ఏప్రిల్ 4వ తేదీన ఉన్నత విద్యాశాఖ జీవో నెం. 21 జారీ చేసింది. అప్పటి నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీపై ఆసక్తి నెలకొంది. రాష్ట్రంలోని 12 విశ్వవిద్యాలయాల్లో మొత్తం 1,588 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులున్నాయి. ప్రస్తుతం 467 మంది పని చేస్తున్నారు. మిగతా 1,121 పోస్టులు ఖాళీలుగా ఉన్నాయి.
ఖాళీగా ఉన్న వాటిలో 869 మంది కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఎన్నో ఏళ్లుగా సేవలందిస్తున్నారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని వీరందరూ ఇటీవల ఆందోళన బాట పట్టారు. వీరికి ఉద్యోగ భద్రత కల్పిస్తామని గతంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. అందుకే కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ల జోలికి వెళ్లకుంగా, ఎలాంటి సమస్యలు లేకుండా మిగిలిన 402 ఖాళీలను తొలి విడతలో భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కొత్త చీఫ్ సెక్రెటరీగా బాధ్యతలు చేపట్టిన రామకృష్ణారావు శుక్రవారం ఉన్నత విద్యామండలి, విద్యాశాఖ అధికారులతో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీపై సమీక్ష నిర్వహించారు. దీంతో అసిస్టెంట్ పోస్టుల భర్తీ ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసినట్లయింది.