ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఓఎన్‌జీసీ) ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, జనరల్ విభాగాలకు చెందిన ప్రతిభావంతులైన పేద విద్యార్థులను ఉన్నత విద్య దిశగా ప్రోత్సహించడానికి స్కాలర్‌షిప్స్ అందజేస్తుంది. ఏటా మొత్తం 2000 స్కాలర్‌షిప్పులు అందిస్తోంది. వీటిలో ఎస్సీ, ఎస్టీలకు 1000, ఓబీసీలకు 500, జనరల్ అభ్యర్థులకు 500 కేటాయించారు.
అన్ని విభాగాల్లోనూ 50 శాతం స్కాలర్‌షిప్పులు మహిళలకు దక్కుతాయి. సంబంధిత విభాగాల్లో యూజీ, పీజీ కోర్సులు చదువుతున్నవారు అర్హులు. ఎంపికైనవారికి నెలకు రూ.4000 చొప్పున ఏడాదికి రూ.48,000 స్కాలర్‌షిప్పు అందుతుంది. కోర్సు పూర్తయినంత వరకు ఈ ఆర్థిక ప్రోత్సాహం కొనసాగుతుంది.
అర్హత: ఏదైనా విద్యాసంస్థలో ఫుల్‌టైమ్ కోర్సు రెగ్యులర్ విధానంలో చదువుతున్నవారై ఉండాలి. బ్యాచిలర్ డిగ్రీ స్థాయిలో ఇంజినీరింగ్(బీఈ/బీటెక్), ఎంబీబీఎస్ లేదా పీజీ స్థాయిలో జియాలజీ/ జియోఫిజిక్స్/ ఎంబీఏ వీటిలో ఏ కోర్సులోనైనా 2024-25 విద్యా సంవత్సరంలో చేరిన ప్రథమ సంవత్సరం విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఇంజినీరింగ్, ఎంబీబీఎస్ కోర్సులు చదువుతున్న విద్యార్థులు ఇంటర్‌లో కనీసం 60 శాతం మార్కులు సాధించడం తప్పనిసరి. అలాగే ఎమ్మెస్సీ- జియాలజీ/ జియోఫిజిక్స్ లేదా ఎంబీఏ కోర్సులు చదువుతున్న విద్యార్థులైతే డిగ్రీలో 60 శాతం ఉండాలి. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.2 లక్షలకు మించరాదు. ఎస్సీ, ఎస్టీలైతే రూ.4.5 లక్షల వరకు ఉండొచ్చు. ఆగస్టు 1, 2024 నాటికి 30 ఏళ్లకు మించరాదు.
సెలెక్షన్: ఇంజినీరింగ్, ఎంబీబీఎస్ కోర్సులకు ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగా; ఎంబీఏ, జియాలజీ, జియోఫిజిక్స్ కోర్సులకు డిగ్రీ మార్కులతో స్కాలర్‌షిప్పులు మంజూరు చేస్తారు.
డ్యురేషన్: ఇంజినీరింగ్, ఎంబీబీఎస్ కోర్సుల్లో చేరినవారికి నాలుగేళ్లు; ఎంబీఏ, జియాలజీ, జియోఫిజిక్స్ కోర్సుల్లో చేరినవాళ్లకు రెండేళ్ల పాటు నెలకు రూ.4000 చొప్పున చెల్లిస్తారు.
అప్లికేషన్స్: ఓఎన్‌జీసీ వెబ్‌సైట్‌లో వివరాలు నమోదుచేయాలి. వయసు, కుల ధ్రువీకరణ, పదో తరగతి మార్కులు, ఇంటర్ లేదా గ్రాడ్యుయేషన్ మార్కులు, ఆదాయ ధ్రువీకరణ, బ్యాంకు అకౌంట్, పాన్ కార్డు, కాలేజీ ఐడీ, ప్రవేశ వివరాలు.. ఈ పత్రాలన్నీ అందించాలి. అభ్యర్థులు సెప్టెంబరు 18 వరకు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు www.ongcscholar.org వెబ్‌సైట్‌లో సంప్రదించాలి.