దేశ రక్షణలో పాలుపంచుకోవాలనే యువతకు వివిధ విభాగాల్లో భారీ సంఖ్యలో కానిస్టేబుల్(జీడీ) నియామకాల ప్రక్రియకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సిద్ధమవుతోంది. ఎస్‌ఎస్‌సీ వార్షిక క్యాలెండర్ ప్రకారం (2024-–25) ఆగస్టు 27న నోటిఫికేషన్ వెలువడనుంది. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 5వ తేదీన పూర్తి కానుంది. వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో రాత పరీక్షలు జరగనున్నాయి.
పదో తరగతితో సెంట్రల్ జాబ్
పదో తరగతి విద్యార్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు. పురుష అభ్యర్థుల ఎత్తు 170 సెం.మీ.లకు, మహిళా అభ్యర్థులకు 157 సెం.మీ.లకు తగ్గకూడదు. వయోపరిమితి 18 నుంచి 23 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు సడలింపు ఉంటుంది. రూ.21,700-రూ.69,100 మధ్య జీత భత్యాలు చెల్లిస్తారు. రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, వైద్య పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన, రిజర్వేషన్ అనుసరించి వివిధ సాయుధ బలగాల్లో అభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపిక అవుతారు. బీఎస్‌ఎఫ్, సీఐఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ, ఎస్‌ఎస్‌ఎఫ్‌లో కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టులు; అస్సాం రైఫిల్స్‌లో రైఫిల్‌మ్యాన్ (జనరల్ డ్యూటీ); ఎన్‌సీబీలో సిపాయి పోస్టులు భర్తీ కానున్నాయి.