గతేడాది సెప్టెంబరు 6న 5,089 పోస్టుల భర్తీకి ఇచ్చిన ప్రకటనను రద్దు చేసిన విద్యాశాఖ, తాజాగా అదనపు పోస్టులను జత చేస్తూ 11,062 టీచర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 2,629 కాగా, 727 భాషా పండితులు, 182 పీఈటీ, 6,508 ఎస్జీటీ, ప్రత్యేక కేటగిరీ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 220, ఎస్జీటీ 796 ఉన్నాయి. మార్చి 4 నుంచి ఏప్రిల్ 2 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. పరీక్షల తేదీలను త్వరలోనే తెలియజేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. జూన్ లో నిర్వహించేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
ఆన్లైన్ ఎగ్జామ్: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(సీబీటీ) విధానంలో జరిగే పరీక్షలను కరీంనగర్, వరంగల్, ఖమ్మం, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, నల్గొండ, సంగారెడ్డి జిల్లా కేంద్రాల్లో నిర్వహిస్తామని ప్రభుత్వం తెలిపింది. జిల్లాలను ప్రాధాన్య క్రమంలో అభ్యర్థులు దరఖాస్తుల్లో పేర్కొనాలని, వాటి సామర్థ్యం, అందుబాటులో ఉన్న వాటిని బట్టి కేంద్రాలను కేటాయించనున్నారు.
హైదరాబాద్‌లో అత్యధికం.. పెద్దపల్లిలో అతి తక్కువ
జిల్లాలవారీగా చూస్తే హైదరాబాద్‌లో అత్యధికంగా 878 డీఎస్సీ పోస్టులు భర్తీ చేయనున్నారు. అత్యల్పంగా పెద్దపల్లిలో 93 మాత్రమే ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్ పోస్టులు గరిష్ఠంగా ఖమ్మం జిల్లాలో 176 ఉండగా.. కనిష్ఠంగా మేడ్చల్‌లో 26 పోస్టులు ఉన్నాయి. ఇక ఎస్జీటీ పోస్టుల విషయానికి వస్తే అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో 537, అత్యల్పంగా పెద్దపల్లి జిల్లాలో 21 ఖాళీలు భర్తీ చేయనున్నారు.
