పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేసిన విద్యార్థులకు ఉద్యోగం చేసుకుంటూనే బీటెక్ చదివే అవకాశం వచ్చేసింది. ఒకవైపు కొలువు చేస్తూనే… వారాంతంలో రెండు రోజులపాటు తరగతులకు హాజరై ఇంజినీరింగ్ పూర్తి చేయవచ్చు. మూడేళ్లలోనే బీటెక్ పట్టా దక్కించుకోవచ్చు. ఏఐసీటీఈ దేశవ్యాప్తంగా గత విద్యా సంవత్సరమే(2023–-24) సాయంత్రం బీటెక్ కోర్సులకు పచ్చజెండా ఊపింది.
తరగతుల నిర్వహణకు దేశంలో మొత్తం 137 ఇంజినీరింగ్ కళాశాలలకు అనుమతి లభించగా రాష్ట్రంలో ఓయూ ఇంజినీరింగ్ కళాశాలకు అవకాశం దక్కింది. రాష్ట్రంలో గతేడాది మరో 11 ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలకు ఏఐసీటీఈ నుంచి ఆమోదం లభించినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి రాలేదు. ఈ ఏడాది ఆ కళాశాలలతో పాటు మరి కొన్నింటికి అనుమతి లభించే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.
పాలిటెక్నిక్ డిప్లొమా ఉండాల్సిందే
గత విద్యా సంవత్సరం (2023–-24) నుంచి సాయంత్రం బీటెక్ కోర్సులకు ఏఐసీటీఈ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. సాయంత్రం కోర్సుల్లో చేరాలంటే కనీసం ఏడాదిపాటు ఉద్యోగ అనుభవం తప్పనిసరి. వారు నేరుగా బీటెక్ రెండో ఏడాదిలో చేరొచ్చు. ఒక బ్రాంచికి 30 నుంచి 60 సీట్ల దాకా ఉండొచ్చు.