తెలంగాణలో ఉద్యోగ ఖాళీల గుర్తింపు ప్రక్రియ స్పీడ్ అందుకుంది. ఇప్పటికే కొన్ని శాఖలు తమ విభాగాల్లో ఉన్న ఖాళీల వివరాలను ప్రభుత్వానికి సమర్పించాయి. ఇందులో భాగంగా తెలంగాణ పోలీస్ శాఖ మొత్తం 17 వేల ఖాళీలున్నట్లు ప్రభుత్వానికి నివేదించింది. ఇందులో దాదాపు 16 వేల కానిస్టేబుల్ పోస్టులతో పాటు 1000 ఎస్ఐ పోస్టులున్నాయి.
రాష్ట్రంలో కొత్త జోన్లు.. జిల్లాల వారీగా ఉద్యోగుల విభజన ఇటీవలే ముగిసింది. దీంతో శాఖల వారీగా ఖాళీల సమాచారాన్ని వెంటనే అందించాలని వారం రోజుల కిందటే సీఎస్ సోమేష్కుమార్ ఆదేశాలు జారీ చేశారు. అన్ని శాఖల్లో దాదాపు 76 వేల ఖాళీలున్నట్లు ప్రభుత్వం నియమించిన ఐఏఎస్ల కమిటీ ఇప్పటికే ప్రాధమికంగా గుర్తించింది. ఇప్పుడు చేస్తున్న కసరత్తుతో ఖాళీల సంఖ్య పక్కాగా తేలుతుందని ప్రభుత్వానికి నివేదించింది.
ప్రభుత్వం ఏ క్షణం నోటిఫికేషన్ జారీ చేసినా.. పోలీసు శాఖకు చెందిన నోటిఫికేషన్లే ముందుగా వెలువడుతాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దీంతో పోలీసు శాఖలో ఖాళీల వివరాలపై నిరుద్యోగులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. కొత్త జిల్లాల వారీగా ఖాళీల జాబితాను రెడీ చేసిన పోలీస్ శాఖ రెండు రోజుల కిందటే ఈ వివరాలను ప్రభుత్వానికి సమర్పించినట్లు సమాచారం. మొత్తం 17 వేల ఖాళీలు ఈ జాబితాలో ఉన్నట్లు లెక్కతేలింది.
తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (TSLPRB) ద్వారా వీటిని భర్తీ చేస్తారు. గత ఏడాది కూడా TSLPRB ద్వారా నోటిఫికేషన్లు వేయాలని ప్రభుత్వం భావించింది. కానీ జోన్లు, కొత్త జిల్లాల ఏర్పాటు కారణంగా సాంకేతిక అడ్డంకులు ఎదురయ్యాయి. దీంతో చివరి నిమిషంలో ప్రభుత్వం ఈ ఫైలును పక్కకు పెట్టింది. ఇటీవలే జోన్లు, జిల్లాల సమస్య కొలిక్కి రావటం తో ప్రధాన అడ్డంకి తొలిగిపోయింది. వీటికి అనుగుణంగా ఉద్యోగుల విభజన, ఉద్యోగుల బదిలీల ప్రక్రియ కూడా పూర్తి కావటంతో రిక్రూట్ఎంట్కు లైన్ క్లియర్ అయింది. ఇప్పుడు కొత్త జోన్లు, కొత్త జిల్లాల వారీగా ఖాళీల జాబితా కూడా రెడీ కావటంతో ప్రభుత్వం ఆమోదించటంతో పాటు.. రిక్రూట్మెంట్కు అనుమతించటమే మిగిలింది. దీంతో రాష్ట్రంలో ఏళ్లకేళ్లుగా ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఆశలు చిగురించినట్లయింది.