కేంద్ర ప్రభుత్వ పరిధిలోని వివిధ మంత్రిత్వ శాఖలు, డిపార్ట్‌మెంట్లలో ఖాళీగా ఉన్న గ్రూప్-A, గ్రూప్-B గెజిటెడ్ పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ (అడ్వర్టైజ్మెంట్ నంబర్ 05/2026) విడుదల చేసింది. దీని ద్వారా మేనేజర్, ఎయిర్‌వర్దినెస్ ఆఫీసర్, సైంటిస్ట్-B, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వంటి మొత్తం 194 పోస్టులను భర్తీ చేయనున్నారు. బీఎస్సీ, బీటెక్, పీజీ, పీహెచ్‌డీ అర్హత కలిగిన వారు ఈ ఉద్యోగాలకు ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.
ఖాళీల వివరాలు, విభాగాలు:
ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 32 రకాల పోస్టులు అందుబాటులో ఉన్నాయి.
DGCA: ఎయిర్‌వర్దినెస్ ఆఫీసర్ (25 పోస్టులు)
PESO: డిప్యూటీ కంట్రోలర్ ఆఫ్ ఎక్స్‌ప్లోజివ్స్ (44 పోస్టులు)
IMD (వాతావరణ శాఖ): సైంటిస్ట్-B (మొత్తం 46 పోస్టులు)
డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్స్: మేనేజర్ (మెయిల్ మోటార్ సర్వీస్ – 08 పోస్టులు)
ఇవే కాకుండా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI), మినిస్ట్రీ ఆఫ్ MSME లలో కూడా మరికొన్ని కీలకమైన ఖాళీలు ఉన్నాయి.
కావాల్సిన అర్హతలు:
పోస్టులను బట్టి విద్యార్హతలు వేర్వేరుగా ఉన్నాయి. సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్, మాస్టర్స్ డిగ్రీ (M.Sc/M.A/M.Tech), పీజీ డిప్లొమా లేదా పీహెచ్‌డీ పూర్తి చేసిన వారు అర్హులు. కొన్ని పోస్టులకు (ఉదాహరణకు సైంటిస్ట్-B) ఎలాంటి అనుభవం అవసరం లేదు, మరికొన్ని పోస్టులకు 1 నుంచి 10 సంవత్సరాల వరకు పని అనుభవం అవసరం.
వయస్సు:
సాధారణ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 30 నుంచి 45 సంవత్సరాల వరకు (పోస్ట్‌ను బట్టి) ఉంటుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ/ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్ల వయోసడలింపు లభిస్తుంది.
ఎంపిక విధానం,జీతం:
దరఖాస్తుల సంఖ్యను బట్టి యూపీఎస్సీ షార్ట్‌లిస్ట్ తయారు చేస్తారు. అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉంటే రిక్రూట్‌మెంట్ టెస్ట్ (RT) నిర్వహించి, ఇంటర్వ్యూ చేస్తారు. తక్కువ మంది ఉంటే నేరుగా ఇంటర్వ్యూ ద్వారానే ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఎంపికైన వారికి 7వ సీపీసీ పే మ్యాట్రిక్స్ ప్రకారం లెవెల్-7 నుంచి లెవెల్-13A1 వరకు (పోస్టును బట్టి) నెలకు భారీ జీతంతో పాటు కేంద్ర ప్రభుత్వ అలవెన్సులు లభిస్తాయి.
అప్లికేషన్ ఫీజు & ఎలా అప్లై చేయాలి?
- జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకు చెందిన పురుష అభ్యర్థులు కేవలం రూ. 25 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, అన్ని వర్గాల మహిళా అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.
- అర్హత గల అభ్యర్థులు యూపీఎస్సీ అధికారిక ఆన్‌లైన్ పోర్టల్ https://upsconline.nic.in/ora/లో లాగిన్ అయి, తమ వివరాలతో పాటు ఫోటో, సంతకం, అవసరమైన సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేసి జూన్ 12 (సాయంత్రం 6 గంటల) లోగా అప్లై చేసుకోవచ్చు.





