యూజీసీ నెట్ జూన్ 2026 పరీక్షలకు హాజరైన అభ్యర్థుల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ప్రాథమిక కీని విడుదల చేసింది. జేఆర్ఎఫ్, అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హత, పీహెచ్డీ అడ్మిషన్ల కోసం నిర్వహించిన ఈ పరీక్షకు సంబంధించిన ఆన్సర్ కీలు, రెస్పాన్స్ షీట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి. ప్రాథమిక కీపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే.. తెలపడానికి ఆగస్టు 18 వరకు గడువు ఇచ్చినట్లు ఎన్టీఏ వెల్లడించింది. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా తమ వివరాలను చెక్ చేసుకోవచ్చు.
జూన్ 22 నుంచి 30 వరకు దేశ వ్యాప్తంగా దాదాపు.. 87 సబ్జెక్టులకు ఈ యూజీసీ నెట్ పరీక్షలు.. అత్యంత కట్టు దిట్టమైన వాతావరణంలో జరిగాయి. ప్రస్తుతం తొలి విడతగా 84 సబ్జెక్టులకు సంబంధించిన ప్రొవిజనల్ ఆన్సర్ కీలతో పాటు అభ్యర్థులు రెస్పాన్స్ షీట్లను ఎన్టీఏ వెబ్సైట్లో ఉంచింది.
అభ్యంతరాలు :
విడుదలైన ప్రాథమిక కీలో ఏదైనా సమాధానం తప్పుగా.. ఉందని అభ్యర్థులు భావిస్తే, వారు అధికారిక వెబ్సైట్ ద్వారా అభ్యంతరాలను తెలియజేయవచ్చు. ప్రతి ప్రశ్నపై అభ్యంతరం వ్యక్తం చేయడానికి.. నిబంధనల ప్రకారం రూ. 200 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియకు సంబంధించి ఆగస్టు 18 వరకు గడువు విధించినట్లు ఎన్టీఏ స్పష్టం చేసింది. అంతే కాకుండా అవసరం అయిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించింది.
మరోవైపు.. ఇంగ్లీష్, కామర్స్ , సోషియాలజీ సబ్జెక్టులకు సంబంధించిన క్వశ్చన్ పేపర్ లో వివిధ రకాల లోపాలు ఉన్నాయంటూ అభ్యర్థుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. దీనిని తీవ్రంగా పరిగణించిన ఎన్టీఏ, ఈ సమస్యను పరిశీలించడానికి ఒక ప్రత్యేక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ అందించే సిఫారసులు, నివేదిక ఆధారంగా, ఈ మూడు సబ్జెక్టులకు సంబంధించిన ప్రత్యేక ప్రకటనను త్వరలోనే విడుదల చేయనున్నట్లు స్పష్టం చేసింది. అభ్యర్థులు ఎప్పటికప్పుడు అధికారిక వెబ్సైట్ను సందర్శిస్తూ లేటెస్ట్ అప్డేట్స్ను గమనించాలని అధికారులు వెల్లడించారు.





