టెట్‌లో తెలుగు సబ్జెక్ట్‌కు పేపర్–1, పేపర్–2లో 30 మార్కులు కేటాయించారు. ఇందులో 24 మార్కులు కంటెంట్, 6 మార్కులు మెథడాలజీ సంబంధించి ప్రశ్నలు అడుగుతారు. టెట్–2022 తెలుగు సిలబస్‌లో చాలా విస్తృతంగా ఉంది. ప్రతి టాపిక్‌పై పూర్తి స్థాయి దృష్టి పెడితే గానీ మార్కులు స్కోర్ చేయలేము.
- ప్రశ్నాపత్రంలో తెలుగు సబ్జెక్ట్ పార్ట్–2లో ఇస్తారు. ముందుగా అపరిచిత పద్యానికి 5 మార్కులు, అపరిచిత గద్యానికి 5 మార్కులు ఉంటాయి. ఏదైనా పాఠ్యంశం నుంచి పద్యం ఇచ్చి దాని కింద 5 ప్రశ్నలు ఇస్తారు. అభ్యర్థి పద్యాన్ని అర్థం చేసుకుని జవాబులు ఇవ్వాల్సి ఉంటుంది.
- అపరిచిత గద్యంలో ఏదైనీ పాఠ్యాంశం నుంచి ఒక కథ గానీ, పాఠ్యాంశ నేపథ్యం గానీ కథ రూపంలో ఇస్తారు. దానిలో నుంచి ప్రశ్నలు అడుగుతారు. గతంలో జరిగిన టెట్లలో గద్యం ఎక్కువగా గ్రాంథిక భాషలో ఇస్తున్నారు. దానిని జాగ్రత్తగా చదివి జవాబులు ఎంపిక చేసుకోవాలి.
- అభ్యర్థులు 1 నుంచి 10వ తరగతి వరకు తెలుగు పాఠ్యాంశంలో ఉన్న కవి పరిచయాలు, పాఠ్యాంశ నేపథ్యాలను జాగ్రత్తగా చదవాలి. ఇచ్చిన పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందినది, దాని ఇతివృత్తం ఏమిటనేది తెలుసుకోవాలి. వీటితో పాటు పాఠ్యాంశంలో ఉన్న పాత్రలు పేర్లను చదువుకోవాలి.
ఉదా ప్రశ్న: 1. పల్లెటూరి పిల్లగాడా పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందినది?
జవాబు: గేయ ప్రక్రియ
ఉదా ప్రశ్న: 2 పల్లెటూరి పిల్లగాడా పాఠ్యాంశ రచయిత ఎవరు?
జవాబు: సుద్దాల హనుమంతు
ఉదా ప్రశ్న3: పల్లెటూరి పిల్లగాడ పాఠ్యాంశ ఇతివృత్తం ఏమిటి?
జవాబు: మానవీయ విలువు, బాలకార్మిక వ్యవస్త నిర్మూలన
- పాఠ్యాంశం చివరలో ఉన్న అర్థాలు, నానార్థాలు, పర్యాయ పదాలు, వ్యతిరేక పదాలు, ప్రకృతి, వికృతులు, వృత్యత్పర్థాలు చదువుకోవాలి.
- గేయాలు, పద్యాలు వరుస క్రమాన్ని గుర్తించుకోవాలి. పద్యంలోని పదాలు తికమక ఇచ్చి వరుస క్రమాన్ని సరిచేయమని కూడా ప్రశ్నలు అడగవచ్చు.
ఉదా ప్రశ్న1: ఈ కింది పద్యాన్ని వరుస క్రమంలో అమర్చండి?
1. ఏ మంచి పువ్వులను ప్రేమించినావె
2. ఏ పూర్వ పుణ్యమో ఏ యోగ బలమమో
3. నిను మోసే ఈ తల్లి కనకగర్భమున
4. జనియించినావో స్వర్గఖండమున
A. 2,4,1,3 B. 4,2,3,1 C.3,2,1,4 D.4,1,2,3
సరైన జవాబు. (A)
- పాఠ్యాంశంలోని ఏదైన పద్యం ఇచ్చి అందులో ఉన్న అలంకారాన్ని గుర్తించండి అనే ప్రశ్నలు తరుచుగా అడుగుతున్నారు. అదే విధంగా పద్యం ఏ జాతికి చెందినది? చంధస్సు, గణాలను గుర్తించడం ప్రాక్టీస్ చేయాలి. చంధస్సులో యతిస్థానం, పద్య పాదంలోని అక్షరాల సంఖ్య, ప్రాస నియమం లాంటి అంశాల నుంచి ప్రశ్నలడుగుతున్నారు.
- పాఠ్యాంశంలోని పదాలు ఇచ్చి సంధి విడదీయం, సంధి పేరు, సమాస పదాలు వివరించడం, సమాసం పేరు ఇచ్చి దానికి సంబంధించిన పదాలను గుర్తించమని ప్రశ్నలు అడుగుతున్నారు. పద్యంలో మకుటానికి అర్ధం ఏమిటి?, ఏ మకుటం ఏ కవికి చెందినదనేది గుర్తుంచుకోవాలి.
- ప్రాథమిక స్థాయిలోని పాఠ్యపుస్తకాల్లో పొడుపు కథలు ఇచ్చారు. సిలబస్‌లోనూ వీటిని చేర్చారు. అభ్యర్థులు 1 నుంచి 8వ తరగతి వరకు ఉన్న పాఠ్యపుస్తకాల్లో పొడుపు కథలను గుర్తు పెట్టుకోవాలి.
ఉదా: 1. వెండి గొలుసును వేయగలము కానీ తీయలేమము ఏమిటది?
జవాబు: వాకిట్లో ముగ్గు
2. తీసేకొద్ది పెరుగుతుంది ఏమిటది?
జవాబు : గొయ్యి
- తెలుగు వ్యాకరణ అంశాల విషయానికొస్తే భాషాంశాలు, వర్ణమాల, వర్ణక్రమాలు, ద్విత్వాక్షరాలు, సంయుక్తాక్షరాలు, సంశ్లేషాక్షరాలు కలిగిన పదాలు నోట్స్‌లో ఒక దగ్గర రాసుకోవాలి. భూత, వర్తమాన, భవిష్యత్, తద్ధర్మకాలలు వివరంగా తెలుసుకుని బిట్స్ ప్రాక్టీస్ చేయాలి.
- అసమాపక క్రియలు, సమాపక క్రియలు, సకర్మక, అకర్మక, విద్యార్థక, ఆశ్చర్యార్థక, ప్రేరణాత్మక, అనుమత్యర్థక, సందేహార్థక, గౌరవార్థక, సంభావార్థక, క్వార్థం, శత్రర్థక, చేదర్థక, అప్యర్థక, అంతర్యర్థక, తుమున్నర్థక క్రియలు, అప్యర్థక క్రియలు వీటితో పాటు, సామాన్య, సంశ్లిష్ట, సంయుక్త, కర్తరీ, కర్మణీ, ప్రత్యక్ష, పరోక్ష వాక్యాలు జాగ్రత్తగా నేర్చుకోవాలి. సిలబస్‌లో ఇచ్చిన ప్రతి అంశాలను ఫోకస్ చేస్తూ వాటికి సంబంధించిన థియరీ పార్ట్‌తో పాటు బిట్స్ ప్రాక్టీస్ చేస్తే తెలుగులో మంచి మార్కులు సాధించవచ్చు. తెలుగు సబ్జెక్ట్ టెట్‌తో పాటు త్వరలో నిర్వహించబోయే డీఎస్సీలోనూ ఉంటుంది. కనుగ అభ్యర్థులు తేలికగా తీసుకోకుండా సబ్జెక్ట్‌పై పట్టు సాధిస్తే విజయం మీ సొంతమవుతుంది.