టెట్ ఫీజు చెల్లించే గడువు కాసేపట్లో ముగియనుంది. (ఈరోజు అర్థరాత్రి 12 గంటల వరకు అభ్యర్థులు ఫీజు చెల్లించే వీలుంది) రేపటి లోగా అభ్యర్థులు అప్లికేషన్లు సబ్మిట్ చేసుకునేందుకు గడువు ఉంది. ఇప్పటికే అంచనాకు మించి ఎక్కువ అప్లికేషన్లు రావటంతో గడువు పెంచే అవకాశం లేదని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. దరఖాస్తుల్లో తప్పులు ఉంటే ఎడిట్ చేసుకునే ఆప్షన్ ఇచ్చే ప్రతిపాదన కూడా విరమించుకున్నారు. గతంలో 2017 టెట్ నిర్వహించినప్పుడు ఆప్షన్ ఇవ్వలేదని… అదే ప్రకారం ఈసారి కూడా ఎడిట్ అప్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదని వివరణ ఇచ్చారు.
అప్లికేషన్ల సంఖ్య అంచనాలు మించటంతో ఇప్పటికే 20 జిల్లాలో ఎగ్జామ్ సెంటర్లను బ్లాక్ చేశారు. సోమవారం మధ్యాహ్నానికే మొత్తం అప్లికేషన్ల సంఖ్య 4 లక్షలు దాటిందని.. గడువు ముగిసేలోగా మరో లక్ష మంది అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశముందని అంచనా వేస్తున్నారు. దీంతో మరింత గడువు పెంచితే పరీక్ష కేంద్రాల ఏర్పాటు.. పరీక్ష నిర్వహణ ఇబ్బందికరంగా మారుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అందుకే గడువు ప్రకారం అప్లికేషన్లు క్లోజ్ చేసేందుకు విద్యాశాఖ మొగ్గు చూపుతోంది.
మరోవైపు స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీదేవసేన టెట్ ఆఫీసర్లతో సోమవారం సాయంత్రం అత్యవసరంగా భేటీ అయ్యారు. గడువు పెంపునకు సంబంధించిన సాధ్యాసాధ్యాలపై ఇందులో చర్చించే అవకాశాలున్నాయి. 12న మధ్యాహ్నం రాష్ట్ర కేబినేట్ భేటీ ఉండటంతో మంగళవారం ఉదయం కల్లా ఇందుకు సంబంధించి పూర్తి క్లారిటీ వస్తుందని ఆఫీసర్లు చెబుతున్నారు.