లక్షలాది మంది నిరుద్యోగులు ఆసక్తిగా ఎదురుచూస్తోన్న గ్రూప్-4 దరఖాస్తుల ప్రక్రియ (TSPSC Group-4) వాయిదా పడింది. ముందుగా విడుదల చేసిన వెబ్ నోట్ ప్రకారం.. ఈ రోజు నుంచి దరఖాస్తులు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే దరఖాస్తు ప్రక్రియను వాయిదా వేస్తున్నట్లు టీఎస్పీఎస్సీ (TSPSC) ప్రకటించింది. అయితే.. వివిధ శాఖల నుంచి సమగ్రంగా సమాచారం రాకపోవడంతోనే దరఖాస్తుల ప్రక్రియ వాయిదా వేయాల్సి వచ్చిందని సమాచారం. రోస్టర్, పోస్టులపై క్లారిటీ రాకపోవడంతో టీఎస్పీఎస్సీ అనివార్య పరిస్థితుల్లో గ్రూప్-4 దరఖాస్తు ప్రక్రియను వాయిదా వేసింది. ఈ మేరకు వెబ్ నోట్ విడుదల చేసింది. టెక్నికల్ సమస్య కారణంగా గ్రూప్ 4 దరఖాస్తుల ప్రక్రియను డిసెంబర్ 30వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. అభ్యర్థులు తమ దరఖాస్తులను జనవరి 19, 2023 సాయంత్రం 5 గంటల వరకు సమర్పించాల్సి ఉంటుందని ప్రకటనలో పేర్కొన్నారు. పూర్తి వివరాలకు అధికారిక వెబ్ సైట్ (https://www.tspsc.gov.in/) ను సందర్శించాలని అభ్యర్థులకు సూచించారు.అయితే.. ఇందుకు సంబంధించిన ఫుల్ నోటిఫికేషన్ ను మాత్రం ఈ రోజు సాయంత్రంలోగా విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. టీఎస్పీఎస్సీ తాజా ప్రకటనతో నిరుద్యోగులు తీవ్ర నిరాశకు గురయ్యారు.
READ THIS: టీఎస్పీఎస్సీ నుంచి మరో జాబ్ నోటిఫికేషన్.. మొత్తం ఖాళీలు ఎన్నంటే?
ఈ నెల 27న గ్రూప్-2?
ఇదిలా ఉంటే గ్రూప్-2 నోటిఫికేషన్ ను ఈ నెల 27న విడుదల చేయనున్నట్లు సమాచారం. ఖాళీల లెక్క తేలడంతో నోటిఫికేషన్ విడుదలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సమాచారం. వాస్తవానికి ఈ నెల 16నే గ్రూప్-2 నోటిఫికేషన్ ను విడుదల చేయాల్సి ఉంది. అయితే.. వివిధ టెక్నికల్ కారణాలతో ఆ రోజు విడుదల చేయలేకపోయింది టీఎస్పీఎస్సీ.