సీఎం కేసీఆర్ గతంలో ప్రకటించిన మేరకు 80 వేలకు పైగా ఉద్యోగాల భర్తీని సాధ్యమైనంత త్వరగా భర్తీ చేయలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఉంది. ఈ మేరకు గ్రూప్ 2, గ్రూప్ 4 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ కసరత్తును ముమ్మరం చేసింది. వచ్చేనెలలో ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్లు రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. దీనికోసం సోమవారం నుంచి డిపార్ట్మెంట్ల వారీగా సమావేశాలు నిర్వహించనుంది. శనివారం టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్థన్ రెడ్డి అధ్యక్షతన కమిషన్ సమావేశం జరిగింది. దీంట్లో గ్రూప్స్ నోటిఫికేషన్, ఇతర అంశాలపై చర్చ జరిగింది.
రాష్ట్రంలో ఇప్పటికే గ్రూప్ 2 ద్వారా 663, గ్రూప్3 లో 1373, గ్రూప్ 4 ద్వారా 9168 పోస్టులను భర్తీ చేసేందుకు ఫైనాన్స్ డిపార్ట్ మెంట్ ఆమోదం తెలిపింది. అయితే తాజాగా గ్రూప్ 2లో సర్కారు కొత్త పోస్టులను చేర్చింది. దీనిద్వారా 60 పోస్టుల వరకూ పెరిగే అవకాశముందని అధికారులు చెప్తున్నారు. గ్రూప్ 3లోనూ కొన్నిపోస్టులు పెరిగే అవకాశముంది. ఈ నేపథ్యంలో సోమవారం అన్ని డిపార్ట్మెంట్లతో టీఎస్పీఎస్సీలో సమావేశం జరగనున్నది. ఆ తర్వాత నుంచి వరుసగా ప్రతిరోజూ కొన్ని డిపార్ట్మెంట్లతో కొత్త రోస్టర్ ఇండెంట్లపై సమీక్షలు చేయనున్నారు. ఎట్టిపరిస్థితుల్లో డిసెంబర్లో గ్రూప్ 2,4 నోటిఫికేషన్ ఇవ్వనున్నట్టు టీఎస్పీఎస్సీ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. త్వరలోనే హారిజంటల్ రిజర్వేషన్లపై క్లారిటీ రానున్నదని వెల్లడించారు.