దాదాపు 2.8 లక్షల మంది అభ్యర్థులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్న గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ ప్రాథమిక ‘కీ’ విడుదలకు టీఎస్పీఎస్సీ (TSPSC) ఏర్పాట్లు చేస్తోంది. శనివారం రోజు ఇందుకు సంబంధించిన కీని విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే ఓఎంఆర్ షీట్లకు సంబంధించి స్కానింగ్ ప్రక్రియ దాదాపు పూర్తయింది. దీంతో ప్రైమరీ కీతో పాటు, ఓఎంఆర్ షీట్లను సైతం వెబ్ సైట్లో అందుబాటులో ఉంచనుంది టీఎస్పీఎస్సీ. అభ్యర్థులు వారి వివరాలతో లాగిన్ అయ్యి కీ, ఓఎంఆర్ షీట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈ సారి గ్రూప్1 ప్రిలిమ్స్ ను సెట్స్ రూపంలో కాకుండా.. నంబర్ సిరీస్ రూపంలో ఇచ్చారు. దీంతో ఒక్కో సిరిస్కు ఒక్కో ‘కీ’ పేపర్ ఇవ్వడం సాధ్యం కాదని అధికారులు అంటున్నారు.
ఈ క్రమంలో మాస్టర్ క్వొశ్చన్ పేపర్ కు మాత్రమే ‘కీ’ ఇవ్వాలని టీఎస్పీఎస్సీ నిర్ణయించింది. అభ్యర్థులు ప్రిలిమినరీ ‘కీ’పై అభ్యంతరాలను తెలపడానికి వారం రోజుల వరకు సమయం ఇవ్వనుంది టీఎస్పీఎస్సీ. ఆ అభ్యంతరాలను పరిశీలించి నిర్ణయం తీసుకోనున్నారు. అనంతరం ఫైనల్ కీని విడుదల చేయనుంది టీఎస్పీఎస్సీ. ఆ వెంటనే ఫలితాలు సైతం విడుదల చేయనున్నారు. ప్రతీ కేటగిరిలో ఒక్కో పోస్టుకు 50మంది చొప్పున అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. అయితే.. గ్రూప్-1 పేపర్ యూపీఎస్సీ స్థాయిలో కఠినంగా ఉందని మెజార్టీ అభ్యర్థులు, నిపుణులు చెబుతున్నారు.