తెలంగాణలో గ్రూప్-4 దరఖాస్తుల ప్రక్రియ గతంలో టీఎస్పీఎస్సీ (TSPSC) విడుదల చేసిన ప్రకటన ప్రకారం ఈ రోజు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే.. ఈ రోజు ఇప్పటివరకు కూడా Application ఆప్షన్ టీఎస్పీఎస్సీ వెబ్ సైట్లో (https://www.tspsc.gov.in/) కనిపించడం లేదు. దీంతో దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధమైన అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు ఉదయం నుంచి ఏ ఇంటర్ నెట్ సెంటర్ వద్ద చూసినా గ్రూప్-4 పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి వచ్చిన అభ్యర్థులే కనిపించారు. కేవలం తమకు మాత్రమే దరఖాస్తు ఆప్షన్ కనిపించడం లేదా? లేకా అందరికీ ఇలానే ఉందా? అన్న సందేహంతో ఒకరికి మరొకరు ఫోన్ చేసి తెలుసుకుంటున్నారు అభ్యర్థులు. అయితే.. ప్రస్తుతం ట్రయల్ రన్ నిర్వహిస్తున్నామని.. అర్థరాత్రి వరకు దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభిస్తామని టీఎస్పీఎస్సీ వర్గాలు తెలిపాయి. సాంకేతిక కారణాలతోనే దరఖాస్తు ప్రక్రియ ఆలస్యమైందని వెల్లడించాయి.
ఇదిలా ఉంటే డిసెంబర్ 1న 9,168 గ్రూప్-4 ఉద్యోగాలకు సంబంధించిన వెబ్ నోట్ ను తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. మొదట ఈ నెల 23 నుంచే దరఖాస్తులు ప్రారంభిస్తామని కమిషన్ పేర్కొంది. అనంతరం సాంకేతిక కారణాలతో దరఖాస్తు ప్రక్రియను వాయిదా వేసి.. ఈ నెల 30 నుంచి ప్రారంభిస్తామని తెలిపింది. దీంతో లక్షలాది మంది నిరుద్యోగులు దరఖాస్తు కోసం ఎదురు చూస్తున్నారు.