గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన అభ్యర్థుల జాబితాపై టీఎస్పీఎస్సీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 15న టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్కు సంబంధించిన ఫైనల్ కీని విడుదల చేసింది. ప్రిలిమినరీ కీతో పోలిస్తే.. ఎనిమిది ప్రశ్నలను మార్పులు చేసింది. అయిదు ప్రశ్నలను పూర్తిగా తొలగించగా.. మూడింటికి రెండేసి సమాధానాలు కరెక్టేనని ప్రకటించింది. దీంతో అభ్యర్థులందరూ తమకు ప్రిలిమ్స్ లో ఎన్ని మార్కులు వస్తాయనే అంచనాల్లో మునిగితేలుతున్నారు. ఒక్కో ప్రశ్నకు 1 మార్కు బదులు 1.034 మార్కుగా పరిగణించనుండటంతో.. దాదాపు 60 మార్కులపైనే జనరల్ పోస్టులకు కటాఫ్ ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. దీంతో అభ్యర్థులు టీఎస్పీస్సీ ప్రకటించే క్వాలిపై జాబితా కోసం ఎదురుచూస్తున్నారు. కానీ.. హైకోర్టు కేసు కారణంగా ఈ జాబితా ఆలస్యమవుతుందని టీఎస్పీఎస్సీ వర్గాలు చెబుతున్నాయి. వారం రోజుల్లో ఈ కేసులో తీర్పు వెలువడే అవకాశముందని.. తదనుగుణంగా పోస్టుల కోటా రిజర్వేషన్లు మార్చాల్సి ఉంటుందని చెబుతున్నారు. మరో పది రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుందని ఆశాభావంతో ఉన్నారు.
మరోవైపు క్వాలిఫై అయిన అభ్యర్థుల జాబితా విషయంలో టీఎస్పీఎస్సీ కొత్త నిర్ణయం తీసుకుంది. ఇప్నటికే ఫైనల్ కీ ప్రకటించినందున.. క్వాలిఫైడ్ జాబితాను ప్రకటించకుండా నేరుగా అభ్యర్థులకు మెయిన్స్ అడ్మిట్ కార్డు ఇస్తే సరిపోతుందని భావిస్తోంది. జాబితాను ప్రకటించటం వల్ల ఉపయోగం లేదని.. యూపీఎస్సీ తరహాలో అభ్యర్థులకు క్వాలిఫై లెటర్లు పంపించనున్నట్లు టీఎస్పీఎస్సీ వర్గాలు సూచనప్రాయంగా వెల్లడించాయి. పోస్టుల రిజర్వేషన్లను బట్టి.. ఒక్కో పోస్టుకు 50 మందిని మెరిట్ ప్రకారం క్వాలిఫై చేస్తామని టీఎస్పీఎస్సీ ముందుగానే ప్రకటించింది. కోర్టు కేసుతో ముడిపడి ఉన్నప్పటికీ మరో పది రోజుల్లో ప్రిలిమినరీ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన అభ్యర్థుల లిస్ట్ రెడీ అవుతుందని అంచనాగా చెబుతున్నారు. అభ్యర్థులు ఎవరికి వారుగా తమ రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి.. క్వాలిఫైడ్ ఫర్ మెయిన్స్ అడ్మిట్ కార్డు పొందే వీలుంటుందని.. తాము క్వాలిఫై అయ్యారా.. లేదా.. దీని ద్వారానే తెలుసుకునే వీలుంటుంది. అంతకు మించి ప్రత్యేకంగా క్వాలిఫైడ్ అభ్యర్థుల జాబితా వెబ్సైట్లో అందుబాటులో ఉండదని తెలుస్తోంది. హైకోర్టు తీర్పు వెలువడగానే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను టీఎస్పీఎస్సీ వెల్లడించే అవకాశముంది.