ఈ నెల 16న తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 503 గ్రూప్-1 ఖాళీల భర్తీకి (TSPSC Group-1) సంబంధించి ప్రాథమిక పరీక్షను నిర్వహించిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన ప్రైమరీ కీని (Group-1 Key) నాలుగు రోజుల క్రితం అధికారులు విడుదల చేశారు. “కీ” కి సంబంధించిన అభ్యంతరాలను నవంబర్ 4వ తేదీన సాయంత్రం వరకు స్వీకరించారు. అయితే.. ఈ ‘కీ’ పై పెద్దగా అభ్యంతరాలు రాలేదని టీఎస్పీఎస్సీ (TSPSC) వర్గాలు తెలిపాయి. శుక్రవారం సాయంత్రం గడువు ముగిసే సమయానికి కేవలం ఐదారు ఆన్సర్లపై మాత్రమే అభ్యంతరాలు వచ్చాయి. ఇందులో ఒకే ప్రశ్నకు సంబంధించి చాలామంది అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు సమాచారం.
అయితే.. ‘కీ’పై తక్కువ అభ్యంతరాలు మాత్రమే రావడంతో టీఎస్పీఎస్సీ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ నేపథ్యంలో ఆ పరీక్ష పూర్తయిన తర్వాత అభ్యంతరాల పరిశీలనకు బుధవారం ఎక్స్ పర్ట్ కమిటీని టీఎస్పీఎస్సీ నియమించనుంది. ఈ కమిటీ నివేదిక మేరకు వారం, పదిరోజుల్లోనే గ్రూప్ 1 ఫైనల్ కీ రిలీజ్ చేయన్నట్టు టీఎస్పీఎస్సీ వర్గాలు వెల్లడించాయి. అయితే.. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఎక్కువ అభ్యంతరాలు వచ్చిన ప్రశ్నకు సంబంధించి అభ్యర్థులకు ఒక మార్కు కలిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.