HomeLATESTకోర్టు కేసులు లేకుండా నోటిఫికేషన్స్​: టీఎస్​పీఎస్​సీ చైర్మన్​ బి.జనార్దన్‌రెడ్డి

కోర్టు కేసులు లేకుండా నోటిఫికేషన్స్​: టీఎస్​పీఎస్​సీ చైర్మన్​ బి.జనార్దన్‌రెడ్డి

కోర్టు కేసులు లేకుండా నిర్ణీత గడువులోగా జాబ్​ రిక్రూట్​మెంట్​ ప్రాసెస్​ పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(టీఎస్‌పీఎస్సీ) ఛైర్మన్‌ బి.జనార్దన్‌రెడ్డి తెలిపారు. రోస్టర్‌ తయారీ, రిజర్వేషన్ల ఖరారు, విద్యార్హతలు నిర్ణయించడంలో సంబంధిత విభాగాల పొరపాట్లతో న్యాయవివాదాలు తలెత్తాయి. భవిష్యత్తులో ఈ తరహా వివాదాల్లేకుండా జాగ్రత్త పడతాం. ఈ మేరకు కమిషన్‌ తరఫున ప్రభుత్వ విభాగాలకు లేఖలు రాశాం. ఒకవేళ ఏమైనా పొరపాట్లు దొర్లితే వెంటనే సరిచేసుకుంటాం. త్వరలోనే వెలువడే ప్రభుత్వ ఉత్తర్వులతో పోస్టులు, భర్తీ ప్రక్రియపై మరింత స్పష్టత వస్తుంది. నోటిఫికేషన్ల జారీ నుంచి రాతపరీక్షకు మధ్య సన్నద్ధతకు తగిన సమయం ఇస్తాం. నియామకాలపై అభ్యర్థుల సందేహాలు, ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక వ్యవస్థను నెలకొల్పి, ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తామని స్పష్టంచేశారు. జిల్లా స్థాయిలో ఏజెన్సీ అభ్యర్థుల సర్టిఫికెట్ల తనిఖీ ప్రక్రియ వేగంగా పూర్తయ్యేలా ప్రతివారం సమీక్ష నిర్వహించి త్వరగా పోస్టింగులు ఇస్తామన్నారు. పరీక్షల్లో అభ్యర్థి ప్రతిభ మేరకు ఎంపికలు ఉంటాయని.. ఉద్యోగాలిప్పిస్తామంటూ ఎవరైనా ప్రలోభాలకు గురిచేస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు.

సిలబస్​లో మార్పులుండవ్​

2‌015లో గ్రూప్‌-1 సిలబస్‌ను కమిషన్‌ ఖరారు చేసింది. ప్రస్తుతం అందులో ఎలాంటి మార్పులు ఉండవు. నోటిఫికేషన్‌ సమయంలోనే దరఖాస్తు చివరి తేదీతో పాటు ప్రిలిమినరీ, ప్రధాన పరీక్ష, ఇంటర్వ్యూలు నిర్వహించే సమయాన్ని సివిల్స్‌ తరహాలో ముందుగానే ప్రకటిస్తాం. ప్రధాన పరీక్షలకు ఈ-–క్వశ్చన్​ పేపర్​ అందిస్తాం. పరీక్ష జరిగిన మరుసటి రోజునే ప్రాథమిక కీ వెలువరించి, నిర్ణీత గడువులోగా అభ్యంతరాలు స్వీకరిస్తాం. ఏమైనా అభ్యంతరాలుంటే.. సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు నిపుణుల కమిటీకి సిఫార్సుచేసి, కమిటీ నిర్ణయం మేరకు ముందుకెళ్తాం. ఇంటర్వ్యూలు పూర్తి పారదర్శకంగా నిర్వహించే వ్యవస్థను ఇప్పటికే కమిషన్‌ సిద్ధం చేసింది.

వన్‌ టైమ్‌ రిజిస్ట్రేషన్‌ అప్​గ్రేడ్​కు అవకాశం

కమిషన్‌ వద్ద ప్రస్తుతం 25 లక్షల మంది ఉద్యోగార్థులు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. ఓటీఆర్‌(వన్‌ టైమ్‌ రిజిస్ట్రేషన్‌)లో వివరాలను అప్‌గ్రేడ్‌ చేసేందుకు, అదనపు అర్హతలు, ఆదాయ వివరాలు నమోదు చేసేందుకు అవకాశం ఇస్తాం. రాష్ట్రపతి నూతన ఉత్తర్వుల ప్రకారం వివరాలు అప్‌డేట్‌ చేసుకునేలా ఇప్పటికే సాఫ్ట్‌వేర్‌ సిద్ధం చేశాం. పది జిల్లాలు 33 జిల్లాలుగా మారడం, స్థానికత నిర్వచనం మారడంతో పలు మార్పులు వస్తాయి. తొలుతే ఈ అవకాశం ఇవ్వడంతో ఏ జిల్లా, జోన్‌, మల్టీజోన్‌ పరిధిలోకి వస్తామో అభ్యర్థులకు తెలుస్తుంది. ఆ మేరకు ఉద్యోగాలకు పోటీపడేలా అవకాశం కలుగుతుంది. ఓటీఆర్‌లో వివరాల అప్‌డేషన్‌కు నిరంతరం అవకాశం ఉంటుంది.

ప్రిపరేషన్​కు తగినంత సమయం ఇస్తాం

ఉద్యోగ నోటిఫికేషన్లకు ముందు కొంత కసరత్తు జరుగుతుంది. ఆర్థికశాఖ పోస్టులను గుర్తిస్తూ జీవో ఇస్తుంది. విభాగాధిపతులు ఖాళీలకు రోస్టర్‌ ప్రకారం రిజర్వేషన్లు, విద్యార్హతలు, స్పోర్ట్స్‌, దివ్యాంగుల కోటా వివరాలతో నోటిఫికేషన్‌ ప్రతిపాదనలు సిద్ధం చేయాలి. దీనికి 7 నుంచి 30 రోజుల సమయం పడుతుంది. ఈ ప్రతిపాదనలు నియామక సంస్థలకు అందిన వెంటనే కమిషన్‌ అధికారులు, విభాగాధిపతులు రిజర్వేషన్లు, విద్యార్హతలు, వయోపరిమితి తదితర వివరాలను సరిచూస్తారు. ఈ ప్రక్రియ పూర్తికి వారం పడుతుంది. ఆ తర్వాత ఉద్యోగ ప్రకటన జారీచేసి దరఖాస్తుల స్వీకరణకు 30 నుంచి 45 రోజుల సమయం ఉంటుంది. దరఖాస్తు గడువు ముగిశాక రాత పరీక్షకు 2 నుంచి 3 నెలల సమయం అవసరం. ఓఎంఆర్‌ జవాబు పత్రాల పరిశీలన, మూల్యాంకనానికి మరో నెల రోజులు కావాలి. అనంతరం సర్టిఫికెట్ల పరిశీలన, తుది ఫలితాలకు 1 నుంచి 2 నెలలు పడుతుంది. నోటిఫికేషన్లు.. పరీక్షలకు మధ్య అభ్యర్థులు సన్నద్ధమయ్యేంత సమయం ఉంటుంది.

merupulu.com
RELATED ARTICLES
text books free download
indian constitution
LATEST
telangana history
PRACTICE TEST
CURRENT AFFAIRS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

x
error: Content is protected !!