ఏఈఈ పోస్టుల రిక్రూట్మెంట్ ఎగ్జామ్ డేట్ను టీఎస్పీఎస్సీ (TSPSC) వెల్లడించింది. 2023 జనవరి 22వ తేదీన (ఆదివారం) ఈ పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటన విడుదల చేసింది. పరీక్ష తేదీకి వారం రోజుల ముందు టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని వివిధ విభాగాల్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి తెలంగాణా స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (TSPSC) ఇటీవలే నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 1540 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (AEE) పోస్టులను భర్తీ చేయనుంది.
మిషన్ భగీరథ, ఇరిగేషన్, పంచాయతీరాజ్ రూరల్ డెవెలప్మెంట్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ట్రైబల్ వెల్ఫేర్, ఆర్ అండ్ బీ విభాగాల్లో ఈ ఖాళీలున్నాయి. సెప్టెంబర్ 22 నుంచి మొదలైన అప్లికేషన్ల ప్రక్రియ అక్టోబర్ 20వ తేదీ నాటికి ముగిసింది. భారీ సంఖ్యలో అభ్యర్థులు ఈ పోస్టులకు పోటీ పడుతున్నట్లు టీఎస్పీఎస్సీ వర్గాలు తెలిపాయి.