తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (TSLPRB) ఇటీవల నిర్వహించిన కానిస్టేబుల్ రాత పరీక్షకు సంబంధించి కొందరు అభ్యర్థులు లేవనెత్తుతున్న సందేహాలు.. చేస్తున్న ఆందోళనలపై బోర్డు స్పందించింది. 22 మార్కులు కలపాలంటూ జరుగుతున్న ప్రచారంపై క్లారిటీ ఇచ్చింది. కొందరు అభ్యర్థులు చేస్తున్న ఈ వాదనలో వాస్తవం లేదని బోర్డు స్పష్టం చేసింది. మరి కొందరు ఇతర దురుద్దేశాలతో ఇలాంటి ప్రచారం చేస్తున్నారని తెలిపింది. ఎలాంటి ప్రామాణికత లేని పుస్తకాలు, స్టడీ మెటీరియల్ ఆధారంగా ఇలాంటి డిమాండ్లు చేస్తున్నారంటూ బోర్డు వెల్లడించింది. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు విశేష అనుభవం కలిగిన ప్రొఫెసర్లు, టీచర్లు, విద్యావేత్తల సలహాల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటుందని స్పష్టం చేసింది.
ఇంకా.. ఓఎంఆర్ షీట్ల వాల్యుయేషన్లో తప్పులు దొర్లాయని కొందరు అభ్యర్థులు చేస్తున్న ఆందోళనపై సైతం బోర్డు స్పందించింది. ఇప్పటికే బోర్డును కొందరు అభ్యర్థులు సంప్రదించగా.. దాదాపు 400 మంది వినతులను పరిశీలించగా వారి ఫలితాల్లో ఎలాంటి మార్పులు లేదని బోర్డు స్పష్టం చేసింది. బోర్డు విడుదల చేసిన ఫలితాల్లో ఎలాంటి తప్పులు లేవన్ని.. ఆ ఫలితాలే ఫైనల్ అని బోర్డు క్లారిటీ ఇచ్చింది.
పోలీస్ ఉద్యోగాలకు సంబంధించిన పార్ట్-2 దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 28వ తేదీన ప్రారంభమైందని బోర్డు తెలిపింది. ఇప్పటికే దాదాపు 40 వేల మంది దరఖాస్తు చేసుకున్నట్లు బోర్డు తెలిపింది. ఇందులో 31 వేల మంది పురుషులు, 9 వేల మంది స్త్రీలు ఉన్నారని బోర్డు ప్రకటించింది. ప్రిలిమ్స్ లో అర్హత సాధించిన అభ్యర్థులు పార్ట్-2 దరఖాస్తులను నవంబర్ 10వ తేదీ రాత్రి పది గంటలలోగా సమర్పించాలని బోర్డు స్పష్టం చేసింది. అభ్యర్థులు ఆఖరి నిమిషం వరకు వేచి చూడకుండా సాధ్యమైనంత ముందుగానే తమ దరఖాస్తులను సమర్పించాలని బోర్డు సూచించింది.