ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే జూన్ 12న టీచర్ ఎలిటిజిబులిటీ టెస్ట్ (టెట్) నిర్వహిస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. జూన్ 12న రైల్వే శాఖకు సంబంధించిన పరీక్షలు ఉన్నందున టెట్ పరీక్షను వాయిదా వేయాలని అభ్యర్థులు వినతులు అందజేశారు. ఈ మేరకు స్పందించిన మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని టెట్ పరీక్ష వాయిదాను పరిశీలించాలని కోరారు. వెంటనే స్పందించిన ఆమె అధికారులతో మాట్లాడారు. అయితే టెట్ పరీక్షను వాయిదా వేయడం కుదరని అధికారులు తేల్చి చెప్పడంతో మంత్రి కేటీఆర్ ట్వీట్‌కు రిప్లై ఇస్తూ.. టెట్ వాయిదా సాధ్యం కాదని తెలిపారు. దీంతో టెట్ వాయిదాపై వస్తున్న వార్తలకు బ్రేక్ పడింది.
జూన్ 06 నుంచి హాల్ టికెట్లు..
జూన్ 06వ తేదీ నుంచి టెట్ హాల్ టికెట్లను వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని అధికారులు తెలిపారు. పరీక్ష నిర్వహణ కోసం ఎగ్జామ్ సెంటర్ల కేటాయింపు పూర్తయిందని, 33 జిల్లా కేంద్రాల్లో పేపర్–1 కోసం 1,480, పేపర్–2కు 1,171 ఎగ్జామ్ సెంటర్లు కేటాయించినట్టు తెలిపారు. టెట్ పరీక్షకు 3.8లక్షల మంది హాజరుకానున్నారు.