టీఎస్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వివిధ కేటగిరీల్లో భర్తీ చేస్తున్న 17,516 ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు, అప్లికేషన్ల వివరాలను వెల్లడించింది. దరఖాస్తు మే 26న ముగియగా.. మొత్తం 7,33,559 మంది అభ్యర్థులు 12,91,006 దరఖాస్తులను సమర్పించారు. ఇందులో ఎక్సైజ్, సివిల్, ట్రాన్స్పోర్ట్, ఏఆర్, టీఎస్ఎస్పీ, ఎస్పీఎఫ్, జైళ్లు, అగ్నిపమాపక శాఖల కానిస్టేబుల్, ఎస్సై పోస్టులకు సంబంధించి ఒక్కో అభ్యర్థి 1 నుంచి 5 పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. అభ్యర్థుల వయోపరిమితిని రెండేళ్లు పెంచడంతో చివరి సమయంలో సుమారు 1.4లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. కాగా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల్లో సుమారు 80శాతం పైగా అభ్యర్థులు 2018లో జరిగిన పోలీసు రిక్రూట్మెంట్కు దరఖాస్తు చేసుకున్నవారే కావడం విశేషం. దాదాపు మెజార్టీ అభ్యర్థులు ఒక పోస్టుకు మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 3,55,679 మంది ఉన్నారు. రెండు పోస్టులకు దరఖాస్తు చేసుకున్నవారు 29 శాతం, మహిళా అభ్యర్థులు అప్లికేషన్లు 2,76,311 వచ్చాయి.
పోస్టులవారీగా అప్లికేషన్లు
- ఎస్సై సివిల్–2,47,630
- సివిల్ కానిస్టేబుల్–9,54,064
- ఎస్సై(ఐటీ అండ్‌కో)–14,500
- ఎస్సై(పీటీవో)–3,553
- ఏఎస్సై ఎఫ్‌పిబి–6,010
- కానిస్టేబుల్(ఐటీ అండ్ కో)–22,033
- కానిస్టేబుల్ డ్రైవర్ అపరేటర్(ఫైర్ సర్వీస్)–38,060
- కానిస్టేబుల్ (మెకానిక్)–5,228
రిజర్వేషన్ల వారిగా దరఖాస్తులు పరిశీలిస్తే..
మొత్తం అప్లికేషన్లలో 51శాతం అప్లికేషన్లు బీసీ అభ్యర్థులవే ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల నుంచి 41శాతం దరఖాస్తులు వచ్చాయి. ఓసీ అభ్యర్థులవి 7.65 శాతం, 3.48శాతం అప్లికేషన్లు తెలంగాణేతర అభ్యర్థులవి ఉన్నాయి.
తెలుగు మీడియం అభ్యర్థులే ఎక్కువ..
పోలీసు ఉద్యోగాలకు వచ్చిన దరఖాస్తుల్లో తెలుగు మీడియం అభ్యర్థులే ఎక్కువ మంది ఉన్నారు. 67 శాతం అభ్యర్థులు ప్రశ్నాపత్రం తెలుగుమీడియం సంబంధించి ఎంపిక చేసుకున్నారు. 32.8శాతం ఇంగ్లీష్ మీడియం, 0.2శాతం అభ్యర్థులు ఉర్దూ భాషను ఎంపిక చేసుకున్నారు.
ఆగస్టు 07 ఎస్సై, 21న కానిస్టేబుల్ ప్రిలిమినరీ
ఆగస్టు 07న నిర్వహించే ఎస్సై ప్రిలిమినరీ పరీక్షకు సుమారు 2.5లక్షల అభ్యర్థులు ఆగస్ట్21న నిర్వహించే కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షకు సుమారు 6.6లక్షల మంది అభ్యర్థులు హాజరుకానున్నారు.