పోలీసు శాఖ ఉద్యోగ నియామకాల్లో అభ్యర్థుల వయోపరిమితిని మరో రెండేండ్ల పాటు పొడిగిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు త్వరలోనే ఉత్తర్వులు జారీ కానున్నాయి. తెలంగాణాలో 95శాతం స్థానికులకే దక్కేలా ఉద్యోగనియామకాలు చేపడుతుండడం, కరోనా కారణంగా ఉద్యోగ నియమాక ప్రక్రియలో ఆలస్యం కావడం తదితర కారణాలను దృష్టిలో పెట్టుకుని పోలీసు ఉద్యోగాలకు పోటీపడే అభ్యర్థుల గరిష్ట వయోపరిమితిని రెండేళ్లు పొడిగించాలని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి చేసిన విన్నపానికి సిఎం కెసిఆర్ సానుకూలంగా స్పందించారు. ఈ మేరకు వెంటనే సవరణ ఉత్తర్వులు విడుదల చేసేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, డిజిపిని సిఎం కెసిఆర్ ఆదేశించారు. కాగా పోలీసు ఉద్యోగాల దరఖాస్తు ప్రక్రియ మే 02న ప్రారంభమై నేటితో( మే 20) ముగియనుంది. ఇప్పటి వరకు సుమారు 9.5లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే రెండేళ్ల వయోపరిమితి పెంచడంతో దరఖాస్తు గడువును కూడా పెంచే అవకాశం ఉంది.