తెలంగాణ పోలీస్ నియామకాలకు (TS Police Jobs) సంబంధించిన ప్రాథమిక ఫలితాలను ఇటీవల పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (TSLPRB) ఇటీవల విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే.. రెండు దశకు సంబంధించిన ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్ (PET), ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ (TMT) ల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఈ పరీక్షలను డిసెంబర్ మొదటి వారం లేదా ఈ నెల చివరివారంలో నిర్వహించాలన్న నిర్ణయానికి వచ్చింది పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్. ఇందు కోసం రాష్ట్ర వ్యాప్తంగా 12 కేంద్రాలను ఎంపిక చేశారు. ఆయా సెంటర్లలో కావాల్సిన సదుపాయాలను అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ప్రక్రియ జోరుగా సాగుతోంది. ఈ పరీక్షలను ప్రారంభించిన 25 రోజుల్లోనే ముగించాలని అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
ఈ ఫిజికల్ ఈవెంట్స్ లో ఎలాంటి అవకతవకలు జరగకుండా సీసీ కెమెరాలను ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంకా ఆ మైదానాల్లో ఇంటర్ నెట్ సదుపాయాన్ని సైతం అందుబాటులోకి తెస్తున్నారు . అన్ని పనులు అనుకున్నట్లు జరిగితే నవంబర్ ఆఖరి వారంలోనే ఈ పరిక్షలు ప్రారంభించాలన్న లక్ష్యంతో తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఉంది.
యూనిట్ ల వారీగా గ్రౌండ్ల వివరాలు
1. హైదరాబాద్ – ఎస్ఏఆర్ సీపీఎల్ అంబర్ పేట
2. సైబరాబాద్ – 8వ బెటాలియన్ కొండాపూర్
3. రాచకొండ – సరూర్ నగర్ స్టేడియం
4. సంగారెడ్డి – పోలీస్ పరేడ్ గ్రౌండ్
5. కరీంనగర్ – సిటీ పోలీస్ శిక్షణ కేంద్రం
6. సిద్దిపేట – పోలీస్ పరేడ్ గ్రౌండ్
7. ఆదిలాబాద్ – పోలీస్ పరేడ్ గ్రౌండ్
8. నిజామాబాద్ – రాజారాం స్టేడియం, నాగారం (నిజామాబాద్)
9. మహబూబ్ నగర్ – డిస్ట్రిక్ట్ స్టేడియం స్పోర్ట్స్ గ్రౌండ్
10. వరంగల్ – హన్మకొండ జవహర్ లాల్ నెహ్రూ స్టేడియం
11. నల్గొండ – మేకల అభినవ్ స్టేడియం
12 ఖమ్మం – పోలీస్ పరేడ్ గ్రౌండ్
ఇదిలా ఉంటే.. మొత్తం ఎస్సై పరీక్షకు 2,25,668 మంది హాజరుకాగా.. దానిలో 1,05,603 మంది అర్హత సాధించారు. కానిస్టేబుల్ సివిల్ పరీక్షకు మొత్తం 5,88,891 మంది హాజరైతే.. దీనిలో మొత్తం 1,84,861 మంది ఉత్తీర్ణులయ్యారు. ట్రాన్స్ పోర్ట్ కానిస్టేబుల్ పరీక్షకు 41,835 మంది హాజరైతే.. 18,758 మంది ఉత్తీర్ణులయ్యారు. ఎక్సైజ్ కానిస్టేబుల్ పరీక్షకు 2,50,890 మంది హాజరైతే.. 1,09,518 మంది అర్హత సాధించారు.