తెలంగాణలో మరో 3,897 ఖాళీల భర్తీకి కేసీఆర్ సర్కార్ అనుమతులు మంజూరు చేసింది. రాష్ట్రంలోని 9 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 3,897 కొత్త పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఈ మేరకు ఉత్తర్వులు సైతం జారీ అయ్యాయి. రాష్ట్రంలోని 9 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, వాటి అనుబంధ ఆస్పత్రుల్లో ఖాళీల భర్తీని త్వరలోనే చేపట్టనున్నారు. ఈ మేరకు వైద్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు తన ట్విట్టర్ ఖాతా ద్వారా వివరాలను వెల్లడించారు.
డెరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోని రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, వికారాబాద్, ఖమ్మం, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, కొమురం భీం ఆసిఫాబాద్, జనగాం, నిర్మల్ జిల్లాలోని మెడికల్ కాలేజీల్లో నియామకాలను చేపట్టనున్నట్లు చెప్పారు. ఈ 9 మెడికల్ కాలేజీల్లో ఒక్కో కాలేజీలో 433 చొప్పున నియామకాలను చేపట్టనున్నట్లు వివరించారు. ఈ నియామకాలతో తెలంగాణ ఆరోగ్య రంగం మరింత బలోపేతం అవుతుందని మంత్రి అన్నారు.