తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగం కోసం.. ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆర్టీసీ కండక్టర్ పోస్టుల భర్తీకి తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. మొత్తం 1,500 కండక్టర్ పోస్టులను నేరుగా రోడ్డు రవాణా సంస్థ భర్తీ చేయనుంది. టెన్త్ ఉత్తీర్ణత కలిగి ఉన్న వారు ఈ పోస్టులకు అర్హులు. ఈ నోటిఫికేషన్, ఎంపిక విధానానికి సంబంధించిన పూర్తి వివరాలు..
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత, టీజీఎస్ఆర్టీసీ ఆవిర్భవించినప్పటి నుంచి ఇప్పటివరకు కండక్టర్ పోస్టుల కోసం ఎలాంటి ప్రత్యక్ష నియామకాలు జరగలేదు. ప్రతి ఏటా వందల మంది ఉద్యోగులు రిటైర్ అవుతుండటంతో డిపోల్లో.. ఖాళీలు భారీగా పెరిగిపోయాయి. ఈ కొరతను తీర్చడానికి గతంలో హైదరాబాద్, సికింద్రాబాద్‌తో పాటు పలు రీజియన్లలో తాత్కాలికంగా అవుట్‌సోర్సింగ్ పద్ధతిలో కండక్టర్లను నియమించారు. కానీ ఇప్పుడు శాశ్వత ప్రాతిపదికన 1,500 మందిని రిక్రూట్ చేసుకోవడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ వేగవంతమైంది.
ఎంపిక విధానం:
ఆర్టీసీ నిబంధనల ప్రకారం.. కండక్టర్ పోస్టుల భర్తీకి పదో తరగతిలో వచ్చిన మార్కుల శాతాన్ని ప్రాతిపదికగా తీసుకుంటారు. రీజియన్ల వారీగా ఉన్న ఖాళీలు, ప్రభుత్వ రిజర్వేషన్ రూల్స్ పాటిస్తూ.. మెరిట్ లిస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మార్కులు వర్సెస్ గ్రేడింగ్:
ఈ నోటిఫికేషన్‌లో ఎంపిక ప్రక్రియకు చిన్న సాంకేతిక సమస్య ఎదురైంది. గతంలో టెన్త్ క్లాస్ పాసైన వారికి మార్కుల శాతం ఉండేది. ఆ తర్వాత ఎస్సెస్సీ బోర్డు గ్రేడింగ్ విధానాన్ని తీసుకొచ్చింది. మళ్లీ ఇప్పుడు గ్రేడింగ్ తీసేసి మార్కుల విధానాన్ని అమలు చేస్తున్నారు. దీని వల్ల అప్లై చేసుకునే అభ్యర్థుల్లో కొందరికి మార్కులు, మరికొందరికి గ్రేడ్ పాయింట్లు ఉన్నాయి.
ఈ రెండు విభిన్న విధానాలను ఒకే పద్ధతిలోకి తెచ్చి, మెరిట్ లిస్ట్ ఎలా తయారు చేయాలనే దానిపై ఆర్టీసీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. గ్రేడింగ్‌ను మార్కుల శాతంగా ఎలా మార్చాలి.అనే అంశంపై స్పష్టత కోసం ఆర్టీసీ యాజమాన్యం ఎస్సెస్సీ బోర్డుకు తాజాగా లేఖ రాసింది.
ఎస్సెస్సీ బోర్డు నుంచి ఈ మార్కులు ,గ్రేడింగ్ సమస్యపై స్పష్టత రాగానే, టీజీఎస్ర్టీసీ కండక్టర్ పోస్టుల అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేయనుంది. కేవలం టెన్త్ క్లాస్ మార్కుల మెరిట్ ఆధారంగానే జాబ్ వచ్చే అవకాశం ఉండటంతో, ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకునే వారికి ఇది ఒక బెస్ట్ ఛాన్స్.





