తెలంగాణలో కొత్త జాబ్ నోటిఫికేషన్ల విడుదల కోసం టీజీపీఎస్సీ వేగంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా అభ్యర్థులందరూ తమ వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (OTR) డేటాను తప్పనిసరిగా అప్‌డేట్ చేసుకోవాలని కమిషన్ చైర్మన్ వెల్లడించారు. ఇటీవల రాష్ట్రంలో జరిగిన ఎస్సీ వర్గీకరణ, అభ్యర్థులు కొత్తగా పొందిన విద్యార్హతలు, కేటగిరీ వివరాల్లో మార్పుల దృష్ట్యా కమిషన్ ఈ నిర్ణయం తీసుకుంది. రిక్రూట్‌మెంట్ ప్రక్రియను వేగవంతం చేయడానికి, ఫలితాల విడుదలలో ఆలస్యం జరగకుండా చూడడానికి ఓటీఆర్ డేటా పక్కాగా ఉండటం ముఖ్యం. ప్రస్తుతం సుమారు 31.56 లక్షల మంది అభ్యర్థులు ఓటీఆర్‌లో నమోదై ఉన్నారు.
ముఖ్యమైన తేదీలు:
నిజానికి ఓటీఆర్ అప్‌డేట్ ప్రక్రియ జనవరి 19న ప్రారంభమైంది. ప్రస్తుతం దీని గడువును ఫిబ్రవరి 25 వరకు పొడిగించారు. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://www.tgpsc.gov.in ద్వారా తమ వివరాలను చెక్ చేసుకోవచ్చు.
మీ వ్యక్తిగత, విద్యా , కేటగిరీ వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి.
కొత్తగా పొందిన డిగ్రీలు లేదా అదనపు అర్హతలను యాడ్ చేయండి.
లేటెస్ట్ కలర్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, అవసరమైన అన్ని సర్టిఫికేట్లను అప్‌లోడ్ చేయండి.
అభ్యర్థికి కేవలం ఒక్క ఓటీఆర్ మాత్రమే ఉండాలి.
గుర్తుంచుకోవాల్సిన అంశాలు:
ఓటీఆర్‌లో ఇటీవలి అర్హతలు, అడ్రస్, ఈడబ్ల్యూఎస్ (EWS), నాన్-క్రీమీ లేయర్, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ వంటివి మాత్రమే ఎడిట్ చేయడానికి వీలుంటుంది. మిగిలిన ప్రధాన అంశాలు మార్చడానికి వీలుండదు కాబట్టి.. వివరాలు ఎంటర్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇకపై వచ్చే అన్ని నోటిఫికేషన్లకు ఓటీఆర్ డేటానే ప్రామాణికం కాబట్టి అప్‌డేట్ చేసుకోని అభ్యర్థులను భవిష్యత్తు నోటిఫికేషన్లకు అనుమతించబోమని కమిషన్ స్పష్టం చేసింది.





