తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) నిరుద్యోగులకు అదిరి పోయే గుడ్ న్యూస్ అందించింది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ పరిధిలో మేనేజర్ (ఇంజనీరింగ్) పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 130 పోస్టులను భర్తీ చేయనున్నారు. సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, సీఎస్ఈ, ఐటీ, ఈసీఈ ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు :
ఈ ఉద్యోగాలకు సంబంధించి ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రక్రియ సెప్టెంబర్ 23 నుంచి ప్రారంభం కానుంది. అప్లై చేయడానికి అక్టోబర్ 17 సాయంత్రం 5 గంటల వరకు అవకాశం ఉంటుంది. ఇదిలా ఉంటే ఇందుకు సంబంధించిన రాత పరీక్షను డిసెంబర్ లో నిర్వహించే అవకాశం ఉంది.
విద్యార్హతలు, పోస్టుల వివరాలు:
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 130 పోస్టులను మల్టీ జోన్-II పరిధిలో భర్తీ చేస్తున్నారు. అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, సీఎస్ఈ, ఐటీ లేదా ఈసీఈ బ్రాంచ్‌లలో గ్రాడ్యుయేట్ డిగ్రీ (ఇంజనీరింగ్) పూర్తి చేసి ఉండాలి. ఇందులో సివిల్ ఇంజనీరింగ్‌కు 80% పోస్టులు, ఎలక్ట్రికల్/మెకానికల్‌కు 15%, అలాగే సీఎస్ఈ/ఐటీ/ఈసీఈ వారికి 5% పోస్టులను కేటాయించారు.
వయస్సు:
అభ్యర్థుల వయస్సు జులై 1 నాటికి 18 నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాల వయస్సు సడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు: ఓసీ, బీసీ అభ్యర్థులకు రూ. 1,000 అప్లికేషన్ ఫీజు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.500 గా నిర్ణయించారు.
జీతం, ఎంపిక విధానం:
ఈ పోస్టులకు ఎంపికైన వారికి ప్రారంభంలోనే రూ. 54,220 నుంచి రూ.1,33,630 వరకు పే స్కేల్ అందుతుంది. అభ్యర్థుల ఎంపిక కోసం ఆబ్జెక్టివ్ విధానంలో రాత పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో పేపర్-1 జనరల్ స్టడీస్ ,జనరల్ అబిలిటీస్ (150 మార్కులు), పేపర్-2 సంబంధిత ఇంజనీరింగ్ సబ్జెక్ట్ (300 మార్కులు) ఉంటాయి. మొత్తం 450 మార్కులకు ఈ పరీక్ష జరుగుతుంది.
అప్లై చేసుకునే విధానం:
అర్హత ఉన్న అభ్యర్థులు మొదట TGPSC అధికారిక వెబ్‌సైట్ ద్వారా వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (OTR) పూర్తి చేసుకోవాలి. ఆ తర్వాత మీ TGPSC ఐడీ, ఓటీపీ సహాయంతో లాగిన్ అయి అప్లికేషన్ ఫారమ్‌ను ఫిల్ చేయాలి. అప్లై చేసే ముందు అన్ని వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకుని ఆన్‌లైన్ ద్వారా ఫీజు చెల్లించి సబ్మిట్ చేయాలి. చివరగా ప్రింట్ అవుట్ తీసుకోవాలి.





