టీజీపీఎస్సీ నిర్వహించే పరీక్షలకు తేదీలను ప్రకటించింది. ఈ మేరకు టీజీపీఎస్సీ సెక్రటరీ నవీన్ నికోలస్ ప్రకటించారు. గురుకులాల్లో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 1, వెల్ఫేర్ అండ్ లేడీ సూపరింటెండెంట్ సహా పలు ఉద్యోగాల పరీక్షల తేదీలను టీజీపీఎస్సీ తెలిపింది. జూన్ 24 నుంచి 29 వరకు ఈ పరీక్షలను నిర్వహించనున్నట్లు వెల్లడించింది. కంప్యూటర్ బేస్డ్ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. పరీక్షలకు మూడురోజుల ముందుగా హాల్ టికెట్లు వెబ్ సైట్లో ఉంచుతామని తెలిపింది.
హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులు, గిరిజన సంక్షేమ శాఖలో గ్రేడ్-I, గిరిజన సంక్షేమ శాఖలో హాస్టల్ సంక్షేమ అధికారి గ్రేడ్-II, షెడ్యూల్డ్ కులాభివృద్ధి శాఖ, బీసీ సంక్షేమ శాఖ, వార్డెన్ గ్రేడ్-I, గ్రేడ్-II, మాట్రాన్ గ్రేడ్-I, గ్రేడ్-II, వికలాంగులు & సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ డైరెక్టర్, లేడీ సూపరింటెండెంట్ చిల్డ్రన్ హోమ్‌లో పోస్టులు, మహిళా శిశు సంక్షేమ శాఖ జనరల్ రిక్రూట్మెంట్ ఖాళీలకు మల్టీషిఫ్ట్‌లలో కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ విధానంలో ఈ పరీక్షలను నిర్వహించనున్నారు.
అభ్యర్థులు 3 రోజుల ముందుగా TGPSC వెబ్సైట్ www.tspsc.gov.in లో హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. పరీక్షకు సంబంధించిన ముఖ్యమైన సూచనలు హాల్‌టికెట్‌పై ప్రింట్ చేశారు. అభ్యర్థులు ఈ మధ్యే తీసుకున్న పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోను హాల్ టికెట్ పై అతికించడం తప్పనిసరని పేర్కొంది. పరీక్ష కేంద్రంలో అధికారుల సమక్షంలో హాల్ టికెట్‌పై సంతకం చేయాల్సి ఉంటుంది. పరీక్ష కేంద్రం/ పరీక్ష హాల్లోకి ప్రవేశించడానికి హాల్ టికెట్‌ను చూపించడం తప్పనిసరి. అలాగే ప్రభుత్వం జారీ చేసిన ఒరిజినల్ ఫొటో గుర్తింపు కార్డు , పాస్‌పోర్ట్, పాన్ కార్డ్, ఓటర్ ఐడీ, ఆధార్ కార్డ్, ప్రభుత్వ ఉద్యోగి ఐడీ లేదా డ్రైవింగ్ లైసెన్స్ ఫ్రూప్ కోసం తప్పనిసరిగా తీసుకుపోవాలి.