తెలంగాణలో సివిల్ ఇంజనీరింగ్ అభ్యర్థుల కోసం టీజీపీఎస్సీ ఇప్పటికే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. రవాణా, రోడ్లు , భవనాల (TR&B) శాఖలో 222 ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. కాగా ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రక్రియ కూడా కొనసాగుతోంది. నెలకు రూ.1.33 క్షల వరకు జీతం, 44 ఏళ్ల వరకు పెంచిన వయోపరిమితితో వచ్చిన ఈ నోటిఫికేషన్‌కు అప్లై చేయడానికి జులై 13 వరకు అవకాశం ఉంది.ఈ ఉద్యోగాలకు సంబంధించి మరిన్ని వివరాలు.
TGPSC AEE రిక్రూట్‌మెంట్ 2026.. పూర్తి వివరాలు
ఖాళీలు,విభాగాలు:
ఈ నోటిఫికేషన్ నంబర్ 01/G/RB/2026 ప్రకారం.. రవాణా, రోడ్లు , భవనాల శాఖలో మొత్తం 222 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (AEE Civil) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలను మల్టీ జోన్ల వారీగా వర్గీకరించారు. ఇందులో మల్టీ జోన్-1 పరిధిలో 112 ఖాళీలు ఉండగా, మల్టీ జోన్-2 పరిధిలో 110 ఖాళీలు ఉన్నాయి. స్థానిక తెలంగాణ అభ్యర్థులకు ఇందులో గరిష్టంగా 95 శాతం రిజర్వేషన్ వర్తిస్తుంది.
అర్హతలు, వయోపరిమితి:
ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుండి సివిల్ ఇంజనీరింగ్‌లో బ్యాచలర్స్ డిగ్రీ (B.E/B.Tech Civil) పూర్తి చేసి ఉండాలి. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా డిగ్రీ పొందిన వారైతే ఏఐసీటీఈ (AICTE) గుర్తింపు తప్పనిసరి. అభ్యర్థుల వయస్సు జూలై 1, 2026 నాటికి కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి, గరిష్టంగా 44 సంవత్సరాల లోపు ఉండాలి. ప్రభుత్వం సాధారణ వయోపరిమితిని 34 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు పెంచడం వల్ల చాలా మంది అభ్యర్థులకు ఇది ఒక పెద్ద ఊరట కానుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ , ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్ల వయో సడలింపు లభిస్తుంది.
జీతం:
ఈ నోటిఫికేషన్ ద్వారా ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 54,220 నుంచి రూ. 1,33,630 వరకు పే-స్కేల్ లభిస్తుంది.
అప్లికేషన్ ఫీజు:
అప్లికేషన్ ప్రక్రియలో భాగంగా ఓసీ , బీసీ అభ్యర్థులు రూ. 1,000 అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఇది రూ. 500 గా నిర్ణయించారు. నిరుద్యోగ అభ్యర్థులకు పరీక్ష ఫీజు (రూ. 120) నుంచి పూర్తి మినహాయింపు ఇచ్చారు. అయితే ప్రభుత్వ లేదా పీఎస్‌యూ ఉద్యోగులు మాత్రం ఈ పరీక్ష ఫీజు కూడా చెల్లించాలి.
ఎంపిక విధానం:
అభ్యర్థుల ఎంపిక పూర్తిగా రాత పరీక్ష ఆధారంగా జరుగుతుంది. ఇది కంప్యూటర్ ఆధారిత (CBRT) లేదా ఓఎంఆర్ (OMR) పద్ధతిలో ఉండవచ్చు. ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-1 జనరల్ స్టడీస్ అండ్ ఎబిలిటీస్ (150 మార్కులు), పేపర్-2 సివిల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ (300 మార్కులు) కలిపి మొత్తం 450 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.ఈ పరీక్షను అక్టోబర్ లో నిర్వహించనున్నారు.
ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రక్రియ:
జూన్ 6 నుంచి అప్లికేషన్లు ప్రారంభం కాగా, అప్లై చేయడానికి చివరి తేదీ జులై 13 (సాయంత్రం 5:00 గంటల వరకు) సమయం ఉంది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ (tgpsc.gov.in) లో తమ వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (OTR) అప్‌డేట్ పూర్తి చేసిన తర్వాతే అప్లై చేసుకోవాలి.





