తెలంగాణలో బీటెక్ అడ్మిషన్ల సెకండ్ లిస్ట్ విడుదలైంది. ఏ కాలేజీలో ఏ కోర్సు అలాటైందో విద్యార్థులకు ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం అందించారు. అధికారిక వెబ్సైట్లో కాలేజీల వారీగా కేటాయించిన సీట్ల వివరాలను అందుబాటులో ఉంచారు. మొదటి రెండు విడతల్లో కలిపి ఇంజనీరింగ్ కాలేజీల్లో 91.2 శాతం సీట్లు భర్తీ అయ్యాయి.
ఇంజనీరింగ్ అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TGEAPCET-2025) ఆధారంగా 2025-26 విద్యా సంవత్సరానికి ఇంజినీరింగ్ సీట్ల భర్తీకి వెబ్ కౌన్సిలింగ్ ప్రకియ కొనసాగుతోంది. కంప్యూటర్ సైన్స్ సంబంధిత కోర్సులు అత్యధికంగా భర్తీ కాగా (95% పైగా), సివిల్, మెకానికల్, బయోటెక్నాలజీ, మైనింగ్ వంటి కొన్ని కోర్సుల్లో ఎక్కువ ఖాళీలు మిగిలాయి.
మొత్తం 96,974 మంది విద్యార్థులు ఈ ఏడాది సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరయ్యారు. తొలి విడతలో 94,354 మంది వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోగా, రెండో విడతలో 68630 మంది నమోదు చేసుకున్నారు. రాష్ట్రంలో మొత్తం 91,495 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 83,521 సీట్లను కేటాయించారు.
సీట్లు పొందిన విద్యార్థులు అధికారిక వెబ్సైట్లో లాగిన్ అయి అలాట్మెంట్ ఆర్డర్ డౌన్ లోడ్ చేసుకోవాలి. ట్యూషన్ ఫీజు చెల్లించి సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్‌లో నమోదు చేసుకోవాలి. ఈసారి తమకు కేటాయించిన కాలేజీలో తప్పనిసరిగా రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. లేకుంటే సీటు రద్దవుతుంది. రెండో విడత అనంతరం మార్పులు కోరుకునే విద్యార్థులకు మూడో విడతలోనూ ఆప్షన్లు నమోదు చేసుకునే అవకాశముంటుంది.
కౌన్సెలింగ్ వివరాలు:
- సర్టిఫికేట్ల ధృవీకరణకు హాజరైన వారు (ఫేజ్ 1 & 2): 96,974
- రెండో దశలో ఆప్షన్లు నమోదు చేసిన వారు: 68,630
- అందిన మొత్తం ఆప్షన్లు: 36,74,976
- అందుబాటులో ఉన్న సీట్లు: 91,495
- కేటాయించబడిన సీట్లు: 83,521
- కొత్తగా సీట్లు పొందిన వారు: 23,509
- స్లైడింగ్ అయిన వారు: 21,402
- ఖాళీగా మిగిలిన సీట్లు: 7,974
కోర్సుల వారీగా సీట్ల భర్తీ:
- ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలలు: 20.7% సీట్లు మాత్రమే నిండాయి
- యూనివర్సిటీ కళాశాలలు: 79.7% సీట్లు
- ప్రైవేట్ యూనివర్సిటీలు: 99.5% సీట్లు
- ప్రైవేట్ కళాశాలలు: 92.1% సీట్లు
- మొత్తం సీట్లు నిండిన శాతం: 91.2%
100% అడ్మిషన్లు పూర్తయిన కళాశాలలు: 77 (5 యూనివర్సిటీ + 72 ప్రైవేట్)
EWS (Economically Weaker Sections) కోటా కింద సీట్లు పొందిన వారు: 6,445 మంది
ఆప్షన్లు ఇచ్చి సీట్లు పొందని వారు: 6,377 మంది
వెబ్‌సైట్ & ఫీజు చెల్లింపు లింక్: https://tgeapcet.nic.in






