తెలంగాణలో తొలి విడత ఉపాధ్యాయ అర్హత పరీక్షలు (టెట్) జూన్ 22తో విజయవంతంగా ముగిసాయి. ఈ పరీక్షలకు మొత్తం 74.81% మంది అభ్యర్థులు హాజరయ్యారు. పేపర్-1, పేపర్-2 పరీక్షల కోసం మొత్తం 1,53,752 మంది అప్లై చేసుకోగా, వారిలో 1,15,028 మంది పరీక్ష రాయగా, 38,724 మంది గైర్హాజరయ్యారు. జూన్ 22 వరకు ఆన్‌లైన్ విధానంలో ఈ పరీక్షలు జరిగాయి. కాగా.. జూన్ 30న ప్రాథమిక కీ విడుదల కానుంది. అభ్యర్థులు తమ అభ్యంతరాలను జులై 2 లోపు వెబ్‌సైట్ ద్వారా సమర్పించవచ్చని అధికారులు తెలిపారు.
జూన్ 16న ప్రారంభమైన ఈ ఆన్‌లైన్ పరీక్షలు.. 17,18,19 తేదీలతో పాటు చివరి రోజైన జూన్ 22 (సోమవారం) వరకు వివిధ సెషన్లలో జరిగాయి. కంప్యూటర్ ఆధారిత పద్ధతిలో (CBT)నిర్వహించిన ఈ పరీక్షల కోసం అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఈ ఏడాది టెట్ పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా భారీ సంఖ్యలో అభ్యర్థులు పోటీ పడ్డారు. మొత్తం హాజరు శాతం 74.81 శాతంగా నమోదైంది. గత పరీక్షలతో పోలిస్తే ఈసారి హాజరు శాతం ఆశాజనకంగానే ఉందని విద్యాశాఖ వర్గాలు భావిస్తున్నాయి.
ప్రాథమిక కీ, అభ్యంతరాల స్వీకరణ:
పరీక్షలు రాసిన అభ్యర్థులు తమ మార్కులను అంచనా వేసుకోవడానికి వీలుగా ఈ నెల 30న ప్రాథమిక కీని విడుదల చేయనున్నట్లు కన్వీనర్ ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ రెస్పాన్స్ షీట్లు, కీని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ ప్రాథమిక కీలో ఏవైనా తప్పులు ఉన్నట్లు గుర్తిస్తే లేదా ప్రశ్నలపై అభ్యంతరాలు ఉంటే.. అభ్యర్థులు వాటిని జులై 2వ తేదీ లోపు ఆన్‌లైన్ విధానంలోనే వెబ్‌సైట్ ద్వారా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువు ముగిసిన తర్వాత వచ్చే ఎలాంటి అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోబోమని అధికారులు స్పష్టం చేశారు. అభ్యంతరాల స్వీకరణ ముగిసిన అనంతరం నిపుణుల కమిటీ వాటిని పరిశీలించి, త్వరలోనే ఫైనల్ కీతో పాటు ఫలితాలను విడుదల చేసేందుకు కసరత్తు చేస్తోంది.





