తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TG TET -2026) రాసిన అభ్యర్థుల నిరీక్షణకు తెరదించుతూ పాఠశాల విద్యాశాఖ ప్రాథమిక కీని విడుదల చేసింది. జనవరి 3 నుంచి 20వ తేదీ వరకు రెండు విడతలుగా జరిగిన ఈ కంప్యూటర్ ఆధారిత పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2.37 లక్షల మంది అప్లై చేసుకున్నారు. ఇందులో విశేషం ఏమిటంటే, సుమారు 71,670 మంది ప్రస్తుతం విధుల్లో ఉన్న ఉపాధ్యాయులు కూడా తమ అర్హతను పెంచుకునేందుకు ఈ పరీక్షకు హాజరయ్యారు. పేపర్ 1, పేపర్ 2 రాసిన అభ్యర్థులందరూ తమ రెస్పాన్స్ షీట్లతో పాటు అధికారిక కీని ఇప్పుడు వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు.
విడుదల చేసిన ప్రాథమిక కీపై ఏవైనా సందేహాలు లేదా అభ్యంతరాలు ఉంటే ఫిర్యాదు చేసేందుకు విద్యాశాఖ ఫిబ్రవరి 1వ తేదీ వరకు గడువు ఇచ్చింది. ఈ నెల 30 నుంచే అభ్యంతరాల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కాగా.. అభ్యర్థులు తమ వద్ద ఉన్న సరైన ఆధారాలతో https://tgtet.aptonline.in/tgtet/ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో అభ్యంతరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. నిర్ణీత గడువు ముగిసిన తర్వాత వచ్చిన అప్లికేషన్లను పరిగణనలోకి తీసుకోమని అధికారులు స్పష్టం చేశారు. అభ్యంతరాల పరిశీలన అనంతరం ఫైనల్ కీ, రిజల్ట్ వెల్లడిస్తారు.





