తెలంగాణ ఇంటర్ విద్యార్థుల కోసం బోర్డు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో.. బోర్డు వినూత్న మార్పులు చేపట్టింది. హాల్‌టికెట్ల జారీ నుంచి ప్రశ్నపత్రాల భద్రత వరకు ప్రతి దశలోనూ పారదర్శకత పెంచడమే లక్ష్యంగా బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య కొన్ని సంస్కరణలను ప్రకటించారు. సుమారు 10 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చేలా.. తల్లిదండ్రులకు స్మార్ట్‌ఫోన్ల ద్వారానే పరీక్షలకు సంబంధించిన సమాచారాన్ని చేరవేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు.
పరీక్షలకు సుమారు 45 రోజుల ముందే తల్లిదండ్రుల వాట్సప్ నంబర్లకు హాల్‌టికెట్లను పంపనున్నారు. ఇందులో పరీక్షా కేంద్రం అడ్రస్, హాల్‌టికెట్ నంబర్, ఏ రోజు ఏ పరీక్ష జరుగుతుందో స్పష్టంగా తెలియజేస్తారు. దీని వల్ల చివరి నిమిషంలో హాల్‌టికెట్ల కోసం వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా విద్యార్థులకు ముందే పూర్తి స్పష్టత వస్తుంది.
మరో కీలక మార్పుగా.. సెకండ్ ఇయర్ చదివే విద్యార్థుల హాల్‌టికెట్లపై ఫస్ట్ ఇయర్ మార్కుల లింక్ ఇస్తారు. దీని వల్ల తల్లిదండ్రులు తమ పిల్లలు ఫస్టియర్‌లో సాధించిన మార్కులను, ఒకవేళ ఫెయిల్ అయితే ఏ సబ్జెక్టుల్లో వెనుకబడ్డారో సులభంగా తెలుసుకోవచ్చు. ఇది విద్యార్థులపై పర్యవేక్షణ పెంచడానికి ఉపయోగపడుతుంది.





