తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు (TGBIE) అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించి విద్యార్థులకు కీలక సమాచారం అందించింది. మార్చిలో పూర్తయిన ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయిన వారు, అలాగే మార్కులు పెంచుకోవాలనుకునే రెగ్యులర్ విద్యార్థుల కోసం పరీక్ష ఫీజు చెల్లింపు గడువును పొడిగించారు. జనరల్, ఒకేషనల్ విద్యార్థులు ఎవరైనా సరే, ఈ నెల ఏప్రిల్ 23 వరకు తమ కాలేజీల్లో పరీక్ష ఫీజు చెల్లించవచ్చు. ఫీజు చెల్లించడానికి ఇదే చివరి అవకాశం కాబట్టి విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని బోర్డు సూచించింది.
ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు?
ఈ అవకాశం కేవలం ఫెయిల్ అయిన విద్యార్థులకే కాకుండా అందరికీ వర్తిస్తుంది.
1.గత పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించని జనరల్, ఒకేషనల్ విద్యార్థులు
- మార్కులు పెంచుకోవాలనుకునే విద్యార్థులు కూడా ఈ ఫీజు చెల్లించి పరీక్షలకు హాజరు కావచ్చు.
గడువు :
విద్యార్థులు తమ పరీక్ష ఫీజును చెల్లించడానికి ఏప్రిల్ 23 వరకు సమయం ఉంది. గతంలో నిర్ణయించిన గడువు ముగియడంతో.. చాలా మంది విద్యార్థులు, తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది.
ఫీజు ఎలా చెల్లించాలి?
విద్యార్థులు తమ సంబంధిత కాలేజీ ప్రిన్సిపాల్‌లను సంప్రదించి పరీక్ష ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా ఫీజు కన్ఫర్మేషన్ , పేమెంట్ ప్రక్రియను పూర్తి చేయడానికి ఈ పొడిగించిన గడువు చివరి అవకాశం అని బోర్డు స్పష్టం చేసింది.
విద్యార్థులకు సూచన:
ఇంటర్ ఫలితాల్లో తక్కువ మార్కులు వచ్చిన వారు లేదా ఫెయిల్ అయిన వారు ఈ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను ఉపయోగించుకోవడం ద్వారా ఒక విద్యా సంవత్సరం వృథా కాకుండా చూసుకోవచ్చు. పరీక్షల షెడ్యూల్ , ఇతర వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను క్రమం తప్పకుండా సందర్శించండి.





