రాష్ట్రంలోని ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు కీలక అప్‌డేట్ వచ్చేసింది. టీజీ ఐసెట్ (TG ICET 2026) పరీక్ష రాసిన అభ్యర్థుల కోసం ప్రాథమిక కీ విడుదలకు అధికారులు ముహూర్తం ఖరారు చేశారు. మే 29న ఉదయం 11 గంటలకు రెస్పాన్స్ షీట్లతో పాటు ఈ కీ అందుబాటులోకి రానుంది. ఈ ఏడాది టీజీ ఐసెట్ పరీక్షను నల్గొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ నిర్వహించింది. రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది ఈ ఎంట్రెన్స్ టెస్ట్‌కు హాజరయ్యారు.
టీజీ ఐసెట్ 2026 ప్రాథమిక కీ విడుదల.. పూర్తి వివరాలు
ఈ పరీక్ష ద్వారా రాష్ట్రంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాలు, అనుబంధ కళాశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి గానూ MBA, MCA కోర్సుల్లో సీట్లను కేటాయిస్తారు.
కీ అబ్జెక్షన్స్ & ఫైనల్ కీ షెడ్యూల్:
ప్రాథమిక కీ విడుదల: మే 29(ఉదయం 11 గంటలకు)
అభ్యంతరాల స్వీకరణ: ప్రాథమిక కీ విడుదలైన తర్వాత, ప్రశ్నలు లేదా సమాధానాలపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. దీనికోసం ప్రత్యేకంగా గడువు ఇస్తారు.
ఫైనల్ కీ & ఫలితాల విడుదల: అభ్యర్థులు పంపిన అభ్యంతరాలను నిపుణుల కమిటీ పరిశీలించిన తర్వాత.. జూన్ 19న ఫైనల్ కీతో పాటు ఐసెట్ ఫలితాలను విడుదల చేస్తారు.
కీ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి?
1.ముందుగా అధికారిక వెబ్‌సైట్ icet.tgche.ac.in లోకి లాగిన్ అవ్వాలి.
2.హోమ్ పేజీలో కనిపించే ‘TG ICET 2026 Preliminary Key & Response Sheet’ లింక్‌పై క్లిక్ చేయాలి.
3. తర్వాత హాల్ టికెట్ నంబర్, రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి.
4. స్క్రీన్‌పై రెస్పాన్స్ షీట్‌తో పాటు కీ కనిపిస్తుంది. దాన్ని డౌన్‌లోడ్ చేసుకుని మార్కులను అంచనా వేసుకోవచ్చు.





