టీజీ ఐసెట్ కౌన్సెలింగ్‌లో భాగంగా ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు సంబంధించిన స్పెషల్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తయింది. అభ్యర్థులు తమ అలాట్‌మెంట్ కాపీలను అధికారిక వెబ్‌సైట్ https://tgicet.nic.in/ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అలాట్‌మెంట్ కాపీని పొందేందుకు అభ్యర్థులు లాగిన్‌లో హాల్ టికెట్ నంబర్, పాస్‌వర్డ్, పుట్టిన తేదీ వివరాలు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కేటాయించిన సీటులో అడ్మిషన్ పొందడానికి ఈ కాపీ తప్పనిసరి. ఇప్పటి వరకు ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ఈ ఏడాది చేరిన వారి సంఖ్య 30,371 కాగా.. ఇంకా 7,489 సీట్లు ఖాళీగా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 288 కాలేజీలు ఉండగా.. వాటిలో ఏంబీఏ 25,743 సీట్లు, ఎంసీఏలో 4,628 సీట్లు భర్తీ అయ్యాయని అధికారులు వెల్లడించారు.
అలాట్‌మెంట్ కాపీ డౌన్‌లోడ్ ఇలా:
- ముందుగా.. టీజీ ఐసెట్ – 2025 అధికారిక వెబ్‌సైట్ https://tgicet.nic.in/default.aspx లోకి వెళ్లాలి.
- హోమ్ పేజీలో కనిపించే ‘కాండిడేట్ లాగిన్’ పై క్లిక్ చేయండి.
- అనంతరం మీ హాల్ టికెట్ నంబర్, పాస్‌వర్డ్, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేయాలి.
- ‘సబ్మిట్’ బటన్‌పై నొక్కిన తర్వాత.. మీకు ఏ కాలేజీలో సీటు వచ్చిందో డిస్‌ప్లే అవుతుంది.
- ‘ప్రింట్’ లేదా ‘డౌన్‌లోడ్’ ఆప్షన్‌ను ఉపయోగించి మీ అలాట్‌మెంట్ కాపీని పొందవచ్చు.
- కాలేజీలో అడ్మిషన్ కోసం ఈ అలాట్‌మెంట్ కాపీని తప్పనిసరిగా సమర్పించాలి.
స్పాట్ అడ్మిషన్లు ఎప్పుడు ?
స్పెషల్ ఫేజ్ అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి కాగానే ఐసెట్ స్పాట్ అడ్మిషన్ల ప్రకటన వెలువడనుంది. ఈ నెల 13వ తేదీన దీనికి సంబంధించిన మార్గదర్శకాలను అధికారులు ప్రకటించనున్నట్లు తెలిపారు. కాగా ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు.





