రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లో సీట్ల భర్తీకి సంబంధించిన ‘ఈఏపీసెట్’ (EAPCET) కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. ఈ ఏడాది కూడా గత సంవత్సరం లాగే మూడు విడతల్లో కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహించనున్నారు. జూన్ 19 నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానుండగా.. ఆగస్టు 1వ తేదీ నుంచి కొత్త విద్యా సంవత్సరం (తరగతులు) ప్రారంభం కానుంది.
ముఖ్యమైన కౌన్సెలింగ్ తేదీలు:
ఫస్ట్ ఫేజ్: జూన్ 19న ప్రారంభమై జులై 14 నాటికి ముగుస్తుంది. అభ్యర్థులు జూన్ 19 నుంచి 28 వరకు ఆన్ లైన్ అప్లికేషన్లు పూర్తి చేయాలి.జూన్ 22 నుంచి 29 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ ఉంటుంది. వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవడానికి జూన్ 25 నుంచి జులై 1 వరకు అవకాశం ఉంటుంది. మొదటి విడత సీట్ల కేటాయింపు జులై 10న జరుగుతుంది. సీట్లు పొందిన అభ్యర్థులు జులై 14 లోపు కాలేజీల్లో రిపోర్టింగ్ చేసుకోవాలి.
సెకండ్ ఫేజ్ : జులై 17 నుంచి ప్రారంభమై జులై 28 నాటికి ముగుస్తుంది.
థర్డ్ ఫేజ్: జులై 31 నుంచి ప్రారంభమై ఆగస్ట్ 7 నాటికి పూర్తవుతుంది.
కన్వీనర్, మేనేజ్‌మెంట్ (బి-కేటగిరీ) సీట్లు :
గతంలో కన్వీనర్ కోటా కౌన్సెలింగ్ పూర్తయ్యాకే మేనేజ్‌మెంట్ (బి-కేటగిరీ) సీట్ల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చేవారు. దీనివల్ల కన్వీనర్ కోటాలో సీటు పొందిన విద్యార్థులు, తర్వాత టాప్ కాలేజీల్లో బి-కేటగిరీ సీటు రాగానే ముందు వచ్చిన సీట్లను రద్దు చేసుకునేవారు. ఈ సమస్యను నివారించడానికి ఈసారి కన్వీనర్ కోటా కౌన్సెలింగ్‌తో పాటే బి-కేటగిరీ సీట్ల భర్తీకి కూడా అనుమతి ఇవ్వనున్నారు.
ఇంటర్నల్ స్లైడింగ్, స్పాట్ అడ్మిషన్లు:
ఆగస్టు 12 నుంచి 17వ తేదీ వరకు ‘ఇంటర్నల్ స్లైడింగ్’ ప్రక్రియ జరుగుతుంది. విద్యార్థులు తాము చేరిన కాలేజీలోనే ఖాళీగా ఉన్న వేరే నచ్చిన బ్రాంచ్‌ల్లోకి మారేందుకు దీని ద్వారా అవకాశం ఉంటుంది. ఇలా మారిన విద్యార్థులకు కూడా ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తిస్తుంది. ఇక మిగిలిపోయిన సీట్ల భర్తీకి సంబంధించిన ‘స్పాట్ అడ్మిషన్ల’ మార్గదర్శకాలను ఆగస్టు 16న వెబ్‌సైట్‌లో ఉంచుతారు.
సీట్ల రద్దు, వెబ్ ఆప్షన్లు:
విద్యార్థులు రెండో విడత కౌన్సెలింగ్ వరకు మాత్రమే తమ సీట్లను రద్దు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. చివరి విడత తర్వాత సీట్ల రద్దు లేదా బ్రాంచ్ మార్పునకు అవకాశం ఉండదు. తొలి విడతలో సీటు వచ్చిన విద్యార్థులు.. అంతకంటే మెరుగైన కాలేజీ లేదా బ్రాంచ్ కోరుకుంటే రెండో విడతలో మళ్లీ కొత్తగా వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.





