ఉపాధ్యాయ ఉద్యోగమే లక్ష్యంగా బీఈడీ (B.Ed) చేయాలనుకునే అభ్యర్థులకు అడ్మిషన్ కమిటీ కీలక అప్డేట్ ఇచ్చింది. రెండేండ్ల బీఈడీ కోర్సులో సీట్ల భర్తీకి సంబంధించి నిర్వహించే టీజీ ఎడ్ సెట్ ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ వెబ్ కౌన్సెలింగ్ గడువును పొడిగించారు. కాగా కొత్త షెడ్యూల్ ప్రకారం ఆన్లైన్ రిజిస్ట్రేషన్, సర్టిఫికేట్ వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్ల నమోదు, సీట్ల కేటాయింపుకు సంబంధించి మరిన్ని వివరాలు..
ఆగస్టు 3 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్:
బీఈడీ ప్రవేశాల కమిటీ కన్వీనర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్‌లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్, సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు అభ్యర్థులకు ఆగస్టు 3 వరకు అవకాశం కల్పించారు. ఇంకా ప్రాసెస్ పూర్తి చేయని అభ్యర్థులు వెంటనే తమ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది.
వెబ్ ఆప్షన్ల కొత్త షెడ్యూల్:
సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయిన అభ్యర్థులు ఆగస్టు 7 నుంచి ఆగస్టు 10 వరకు తమకు కావలసిన కాలేజీలను ఎంచుకోవడానికి వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. పొరపాటున వెబ్ ఆప్షన్లలో ఏమైనా మార్పులు చేయాలనుకుంటే.. వాటిని సవరించుకోవడానికి ఆగస్టు 11న ప్రత్యేక అవకాశం కల్పించారు.
సీట్ల కేటాయింపు, రిపోర్టింగ్:
అభ్యర్థులు ఎంచుకున్న వెబ్ ఆప్షన్లు, ర్యాంకుల ఆధారంగా ఆగస్టు 16న సీట్ల కేటాయింపు చేపడతారు. సీట్లు పొందిన అభ్యర్థులు ఆగస్టు 17 నుంచి 20 వతేదీలోగా తమకు కేటాయించిన కాలేజీల్లో ఆన్లైన్ అలాట్మెంట్ ఆర్డర్, ఒరిజినల్ సర్టిఫికేట్లతో నేరుగా రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.





