ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో చేరాలనుకునే.. విద్యార్థులకు బిగ్ అప్‌డేట్. టీజీ ఈఏపీసెట్ (TG EAPCET 2026) ఫస్ట్ ఫేజ్ అడ్మిషన్ల కోసం కౌన్సెలింగ్ ప్రక్రియ ఈ రోజు నుంచి అధికారికంగా ప్రారంభమైంది. సాంకేతిక విద్యాశాఖ కమిషనర్, కన్వీనర్ ఎ. శ్రీదేవసేన దీనికి సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేశారు. అంతే కాకుండా విద్యార్థులు తమకు నచ్చిన కాలేజీలను ఎంచుకునేందుకు వీలుగా రాష్ట్ర వ్యాప్తంగా 37 సహాయ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్,సర్టిఫికేట్ వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్ల పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
మొదటి విడత కౌన్సెలింగ్‌కు సంబంధించి ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, స్లాట్ బుకింగ్ కోసం జూన్ 19 నుంచి ఈ నెల 28 వరకు విద్యార్థులకు అవకాశం కల్పించారు. అభ్యర్థులు వీలైనంత త్వరగా ఆన్‌లైన్ ఫీజు చెల్లించి, తమకు అనుకూలమైన తేదీ, కేంద్రాన్ని స్లాట్ బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
మొదటి విడత కౌన్సెలింగ్ పూర్తి షెడ్యూల్:
1.జూన్ 19 నుంచి 28 వరకు ఆన్‌లైన్ ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, స్లాట్ బుకింగ్ ప్రక్రియ జరుగుతుంది.
2. జూన్ 22 నుంచి 29 వరకు హెల్ప్‌లైన్ కేంద్రాలలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది
3.జూన్ 25 నుంచి జులై 1 వరకు వెబ్ ఆప్షన్ల నమోదు (విద్యార్థులు తమకు నచ్చిన కాలేజీలు, కోర్సులను ఎంచుకోవచ్చు). జరుగుతుంది.
4.జులై 4 లేదా అంతకంటే ముందు.. మాక్ సీట్ల కేటాయింపు ప్రక్రియ ఉంటుంది.
5.జులై 5 నుంచి జులై 7 వరకు ఒకవేళ వెబ్ ఆప్షన్లలో ఏవైనా మార్పులు ఉంటే.. ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
6.జులై 10 లేదా అంతకంటే ముందు.. మొదటి విడత అఫీషియల్ సీట్ల కేటాయింపు జరుగుతుంది.
కన్వీనర్ కీలక సూచనలు:
సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియను ముందుగా పూర్తి చేసుకున్న అభ్యర్థులకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవడానికి ఎక్కువ సమయం లభిస్తుంది. అందువల్ల మంచి కాలేజీలు, కోర్సులలో సీటు పొందేందుకు వీలుగా అభ్యర్థులు వీలైనన్ని ఎక్కువ ఆప్షన్లను ఎంచుకోవాలని కన్వీనర్ కోరారు.
ముఖ్య గమనిక: కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్, పూర్తి వివరాల కోసం విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ అయిన tgeapcet.nic.in ను మాత్రమే సంప్రదించాలని స్పష్టం చేశారు.





