రాష్ట్రంలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి దోస్త్ స్పెషల్ ఫేజ్ కౌన్సిలింగ్ షెడ్యూల్‌ను ఉన్నతాధికారులు విడుదల చేశారు. ఇప్పటివరకు జరిగిన మూడు విడతల్లో సీటు రాని వారు, లేదా అస్సలు రిజిస్ట్రేషన్ చేసుకోని వారు డిగ్రీలో చేరడానికి ఇది ఒక లాస్ట్ అండ్ బెస్ట్ గోల్డెన్ ఛాన్స్ అని చెప్పొచ్చు. టీజీసీహెచ్ఈ (TGCHE) చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్టారెడ్డి, కాలేజీల విద్యాశాఖ కమిషనర్ ఎ.శ్రీదేవసేన విద్యార్థుల విద్యావకాశాలను దృష్టిలో ఉంచుకుని స్పెషల్ ఫేజ్ షెడ్యూల్ విడుదల చేశారు.
ఈ స్పెషల్ ఫేజ్ కౌన్సిలింగ్ కోసం జులై 20 నుంచి జులై 26 వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారు. అలాగే జులై 20 నుంచి 27 వరకు విద్యార్థులు తమకు నచ్చిన కాలేజీలు, కోర్సులను వెబ్ ఆప్షన్ల ద్వారా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎవరైనా.. స్పెషల్ కేటగిరీ సర్టిఫికెట్లు కలిగి ఉంటే.. వాటి వెరిఫికేషన్‌ను జులై 27 న యూనివర్శిటీ హెల్ప్ లైన్ సెంటర్లలో నిర్వహిస్తారు. ఇక అందరూ ఎంతగానో ఎదురుచూసే సీట్ల కేటాయింపు జులై 30 న ఉంటుంది. సీటు వచ్చిన అభ్యర్థులు జులై 30 నుంచి ఆగస్టు 1 వ తేదీ వరకు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత జులై 31 నుంచి ఆగస్టు 1 వ తేదీ లోపు డైరెక్ట్‌గా కేటాయించిన కాలేజీకి వెళ్లి రిపోర్ట్ చేయాలి.
ఇక ఫీజు, అర్హతల విషయానికి వస్తే, ఇంతవరకు దోస్త్ పోర్టల్‌లో అస్సలు రిజిస్ట్రేషన్ చేసుకోని విద్యార్థులు రూ. 400 రిజిస్ట్రేషన్ ఫీజు ఆన్లైన్లో చెల్లించి కొత్తగా అప్లై చేసుకోవచ్చు. అయితే.. ఇప్పటికే దోస్త్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుని, ఏ విడతలోనూ సీటు పొందని పాత విద్యార్థులు ఎలాంటి అదనపు ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. వారు నేరుగా తమ పాత దోస్త్ ఐడీ, పిన్ నంబర్‌ను ఉపయోగించి వెబ్ ఆప్షన్లలో పాల్గొనవచ్చు. కానీ ఇప్పటికే సిసిఒటిపి ద్వారా నచ్చిన కాలేజీల్లో చేరి, తమ సీట్లను ఖరారు చేసుకున్న విద్యార్థులు.. మాత్రం ఈ స్పెషల్ ఫేజ్ కౌన్సిలింగ్‌కు అర్హులు కారని అధికారులు స్పష్టం చేశారు. డిగ్రీలో ఖచ్చితంగా సీటు మిస్ అవ్వకూడదనుకుంటే, ఈ ఫేజ్ లో విద్యార్థులు వీలైనన్ని ఎక్కువ సంఖ్యలో వెబ్ ఆప్షన్లను ఎంచుకోవడం మంచిది.





